ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం
వరుస సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. హాలీవుడ్, బాలీవుడ్ లలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోకు టాలీవుడ్ లో జూనియర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఇదే షోను కోలీవుడ్ లో లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ ఇటీవలే టెలికాస్ట్ అయ్యింది.
అయితే బిగ్ బాస్ తమిళ షోకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కమల్ తొలిసారిగా బుల్లితెర మీద కనిపించినా.. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో జూనియర్ షోపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో స్టార్ హీరోల అభిమానులకు షాక్ ఇవ్వగా, తాజాగా బిగ్ బాస్ కోలీవుడ్ వర్షన్ మరోసారి నిరాశపరిచింది.
ముఖ్యంగా బిగ్ బాస్ షోలో స్టార్ ఇమేజ్ ఉన్న నటులెవరూ కనిపించకపోవటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. నమిత, గణేష్ వెంట్రామన్, గాయత్రి రఘురామ్ వంటి ఒకరిద్దరు తప్ప పెద్ద గుర్తింపు ఉన్న నటులెవరు కోలీవుడ్ బిగ్ బాస్ లో కనిపించలేదు. దీంతో కమల్ యాంకరింగ్ చేస్తున్న షో మీద ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. మరి ఎన్టీఆర్ షోలో ఎవరెవరు పాల్గొంటారు..? ఆ షో రిజల్ట్ ఎలా ఉండబోతోంది..? అన్న టెన్షన్ లో ఉన్నారు జూనియర్ అభిమానులు.