డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న స్టార్‌ హీరోలు | Upcoming BIG Tollywood Double Role Movies | Sakshi
Sakshi News home page

డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న స్టార్‌ హీరోలు

Published Sun, Feb 18 2024 12:22 AM | Last Updated on Mon, Feb 26 2024 2:30 PM

Upcoming BIG Tollywood Double Role Movies - Sakshi

అభిమాన హీరో ఒక పాత్రలో కనిపించి సింగిల్‌ ట్రీట్‌ ఇస్తేనే అభిమానులు ఖుషీ అయిపోతారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే పట్టరాని ఆనందం వారి సొంతం. అలా డబుల్‌ రోల్‌లో కనిపించి, డబుల్‌ ట్రీట్‌ ఇవ్వడానికి కొందరు హీరోలు రెడీ అయ్యారు. ఆ స్టార్స్‌ చేస్తున్న ద్విపాత్రాభినయం గురించి తెలుసుకుందాం

 రెండు, మూడు, నాలుగు, పది... ఇలా ఒకే సినిమాలో ఎన్ని పాత్రల్లో అయినా మెప్పించగలరు కమల్‌హాసన్‌. అలా సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్‌ సేనాపతిగా ‘ఇండియన్‌’ (భారతీయుడు) లో కమల్‌ రెండు పాత్రల్లో మెప్పించిన విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఇండియన్‌ 2’ సేనాపతి, అతని తండ్రి పాత్ర నేపథ్యంలో ఉంటుంది. అంటే.. సేనాపతికి అంత దేశభక్తి రావడానికి అతని తండ్రి ఎలా కారణం అయ్యాడు? అనేది ఈ చిత్రంలో ఉంటుందట. 1920లలో కథ సాగడంతో పాటు ఇప్పటికాలం టచ్‌ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్‌. ఇక తాజా చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా నటిస్తున్నారు.

‘సలార్‌’ సినిమా తొలి భాగం ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ ఫైర్‌’తో ప్రభాస్‌ మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ ఒక పాత్రలో కనిపిస్తేనే ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే డబుల్‌ ధమాకానే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘సలార్‌ పార్ట్‌ 2: శౌర్యాంగ పర్వం’లో ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. తండ్రీ కొడుకుగా ప్రభాస్‌ కనిపించే సీన్స్‌ సరికొత్త అనుభూతిని పంచుతాయని టాక్‌. ప్రత్యేకించి 1000 మందితో ఫైట్‌ చేసే ఒక యాక్షన్‌ సీన్‌లో ప్రభాస్‌ రెండో పాత్ర (తండ్రి) ఎంట్రీ ఉంటుందని సమాచారం. ‘సలార్‌’ తొలి భాగంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర చేశారు. రెండో భాగంలో పృథ్వీరాజ్‌ కూడా రెండు పాత్రల్లో కనిపిస్తారట. తొలి భాగంలో ఉన్న బాబీ సింహా, శ్రియా రెడ్డి తదితరులు మలి భాగంలోనూ కనిపిస్తారు.

► ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్‌–డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర చేస్తు్తన్నారు. కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ అక్టోబర్‌ 10న విడుదల కానుంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో, నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. ఎన్టీఆర్‌ తండ్రీకొడుకుగా సందడి చేస్తారని భోగట్టా. యాక్షన్, ఎమోషన్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గతంలో ‘ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్‌’ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌ ‘జై లవ కుశ’లో త్రిపాత్రాభినయంతో మెప్పించిన విషయం తెలిసిందే.

► ఒక్క సినిమాలో కాదు.. వరుసగా రెండు చిత్రాల్లో రామ్‌చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఒకటి శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా. మరొకటి బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందనున్న చిత్రం. ఇక రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికొస్తే... సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని భోగట్టా. తనయుడి పాత్రలో ఎన్నికల అధికారిగా, తండ్రి పాత్రలో రాజకీయ నేతగా కనిపించనున్నారట. రెండో పాత్రకు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటికొచ్చాయి. అందులో చరణ్‌ 70ల్లో వ్యక్తిగా ఖద్దరు వస్త్రాలు ధరించి సైకిల్‌పై వెళుతూ కనిపించారు.

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్‌ ప్రత్యేక పాత్రధారులు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇక బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ చేస్తున్న సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అన్న, తమ్ముడు పాత్రల్లో కనిపించనున్నారట. వెంకట సతీష్‌ కిలారు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. కాగా ‘మగధీర, నాయక్‌’ చిత్రాల్లో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

- పోడూరి నాగ ఆంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement