
జూనియర్ ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం!
జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాలు తీసుకోవడంలో యమ ఫాస్ట్ అంటారు. అందుకే తన తదుపరి సినిమాల విషయంలో టకటకా నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు జూనియర్.
కొంతమంది హీరోలకు కొందరు దర్శకులపై గురి కుదురుతుంది. వాళ్ల పనితీరు, సినిమా విషయంలో వాళ్ల నిబద్ధత, స్టోరీ చెప్పే విధానం.. టేకింగ్ అన్నీ చూస్తే సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంటుంది. అందుకే సినిమా ఇంకా విడుదల కాకముందే మరో సినిమా చేయడానికి ముందుకొస్తారు. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాతో టీమప్ అయిన ఎన్టీఆర్ - కొరటాల శివలది ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది. ఆ సినిమా తీస్తున్న తీరుతో బాగా ఇంప్రెస్ అయిన తారక్.. వచ్చే ఏడాది మళ్లీ కొరటాల శివతోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నాడట.
ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబులకు మిర్చి, శ్రీమంతుడు లాంటి బంపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శివ.. ఇప్పుడు జనతా గ్యారేజ్ రూపొందిస్తున్న తీరు చూస్తే ఇది కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఎన్టీఆర్ అంటున్నాడట. అందుకే వచ్చే ఏడాది శివ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయాలని వీళ్లిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఈలోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్లీ శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు జూనియర్ సిద్ధం అయిపోతున్నట్లు తెలుస్తోంది.
మళయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఆగస్టు నెలలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్ గ్యారేజి ఓనర్ కాగా, ఎన్టీఆర్ ఆయన మేనల్లుడిగా నటిస్తున్నాడు. మళయాళ నటులు ఉన్ని ముకుందన్, రహమాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.