ఆయన ముసలోడే గానీ..
మనసులో ఉన్న మాటను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడంలో ట్వింకిల్ ఖన్నాను మించినవాళ్లు లేరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు మీద జోకులు వేసి ఒక్కసారిగా హెడ్‌లైన్లలోకి ఎక్కిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ మీదే సెటైర్ వేసేసింది. నరేంద్రమోదీ నుంచి అర్ణబ్ గోస్వామి వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా అందరినీ తన తాజా కాలమ్‌లో ఉతికి ఆరేసిన ట్వింకిల్.. అందులో భాగంగానే సల్లూభాయ్ మీద కూడా ఓ పెద్ద సెటైర్ వేసింది.
''భారతదేశంలోనే అత్యంత ముసలోడు.. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు సంబంధం కావాలి. అతడు డాషింగ్, నాన్ వెజిటేరియన్, విజయవంతమైన, కండలు తిరిగిన, మంచి కుటుంబానికి చెందిన అబ్బాయి. డాన్సు బాగా చేస్తాడు, డ్రామా, కళలు కూడా ఉన్నాయి. అమ్మాయి అందంగా, సన్నగా ఉండాలి, లాంగ్‌డ్రైవ్‌లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. పెళ్లికూతురు బాగా మాటకారి కూడా అయి ఉండాలి. ఎందుకంటే మూకీలా ఉంటే అబ్బాయికి ఏమాత్రం నచ్చదు. కులం ఏదైనా పర్వాలేదు.. సుల్తాన్ @ భాయీజాన్.కామ్ ను సంప్రదించండి'' అని అందులో రాసింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. సల్మాన్ సమకాలీకుడే అయిన అక్షయ్ కుమార్‌నే ట్వింకిల్ పెళ్లి చేసుకుంది.