సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల బరిలో టాడ్ ఫిలిప్స్ నిర్మించిన ‘జోకర్’ సినిమా 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ‘ది ఐరిష్‌మేన్’, శ్యామ్ మెండిస్ నిర్మించిన ‘1917’, క్వెంటిన్ టరాంటినో నిర్మించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాలు పదేసి నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన ‘పారాసైట్’ చిత్రం ఆరు నామినేషన్లతో మూడవ స్థానంలో నిలిచింది. మొట్టమొదటి సారిగా ఆస్కార్ బరిలో దక్షిణ కొరియా చిత్రం పోటీ పడడం ఓ విశేషం కాగా, ఉత్తమ చిత్రంతోపాటు, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీలకు పోటీ పడడం మరో విశేషం.
‘పారాసైట్’ చిత్రం భారత్‌లో ఈ నెల 31వ తేదీన విడుదలవుతోంది. ‘లిటిల్ విమెన్’ లాంటి ఉత్తమ చిత్రాలను తీసిన గ్రేటా గెర్విగ్ సహా మహిళా దర్శకులెవరూ ఈ సారి ‘ఉత్తమ దర్శకులు’ కేటగిరీకి ఎంపిక కాకపోవడం దురదృష్టకరం. విమర్శకుల ప్రశంసలందుకున్న ‘పోట్రేట్ ఆఫ్ లేడీ ఆన్ ఫైర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సెలైన్ సియమ్మా, ‘ది నైటింగేల్’ దర్శకులు జెన్నిఫర్ కెంట్, ‘ది ఫేర్‌వెల్’కు దర్శకులు లూలూ వాంగ్, ‘బుక్స్‌మార్ట్’ దర్శకులు ఓలివియా వైల్డ్, ‘హస్టలర్స్’ దర్శకులు లొరేన్ స్కఫారియా, ‘ఏ బ్యూటీఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్’ దర్శకులు మేరెల్లీ హెల్లర్‌లలో ఎవరూ ఆస్కార్‌కు ఎంపిక కాకపోవడం శోచనీయం. అయితే డాక్యుమెంటరీ కేటగిరీలో ఎక్కువ మంది మహిళలు పోటీ పడడం విశేషమే.
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్లను వసూలు చేసిన ‘జోకర్’ సినిమాలో నటించిన జాక్విన్ ఫోనిక్స్‌కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలివుడ్’ చిత్రంలో నటించిన లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్‌లు కూడా ప్రధానంగా ఉత్తమ నటుడి అవార్డుకు పోటీ పడుతున్నారు. అలాగే ఉత్తమ నటి అవార్డుకు ‘మ్యారేజ్ స్టోరీ’లో నటించిన స్కార్లెట్ జాన్సన్, ‘జూడీ’లో నటించిన రెన్నా జెల్‌వెగర్, ‘లిటిల్ విమెన్’లో నటించిన సోయిస్ రోనన్, ‘హరియెట్’లో నటించిన సింథియా ఎరివో, ‘బాంబ్‌షెల్’లో నటించిన చార్లిజ్ థెరాన్‌లు పోటీ పడుతున్నారు.
‘జోకర్’కు 11 ఆస్కార్ నామినేషన్లు
Published Tue, Jan 14 2020 3:17 PM | Last Updated on Tue, Jan 14 2020 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment