అవర్ గర్ల్స్ అవర్ ప్రైడ్
మన ఆడపిల్లలు మనకే గర్వకారణమని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అంటోంది. ‘అవర్ గర్ల్స్ అవర్ ప్రైడ్ అనేది ఓ అద్భుతమైన ట్యాగ్‌లైన్. మన ఆడపిల్లలు మనకే గర్వకారణం.
న్యూఢిల్లీ: మన ఆడపిల్లలు మనకే గర్వకారణమని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అంటోంది. ‘అవర్ గర్ల్స్ అవర్ ప్రైడ్ అనేది ఓ అద్భుతమైన ట్యాగ్‌లైన్. మన ఆడపిల్లలు మనకే గర్వకారణం. మహిళలను మరింత గౌరవించే రోజులు త్వరలోనే వస్తాయ’ని ఆమె తెలిపింది. ఎన్‌డీటీవీ, నేచురల్ రిసోర్స్ గ్రూప్ వేదాంత సంయుక్త ఆధ్వర్యంలో అవర్ గర్ల్స్ అవర్ ప్రైడ్ అనే జాగృతి కార్యక్రమాన్ని సోమవారం ప్రియాంక చోప్రా ప్రారంభించింది.
దేశంలోని భ్రూణ హత్యలు, ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం తదితర విషయాలపై ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించనున్నారని ఆమె తెలిపింది. కడుపులో ఉండగానే పసిపాపలను హత్య చేయడం నిజంగా విచారకరమని వ్యాఖ్యానించింది. బాలికలను భారత్ ఈవిధంగా చూడటం కన్నీళ్లను తెప్పిస్తుందని తెలిపింది.
2011 జనగణన ప్రకారం భారత్‌లో వెయ్యి మంది బాలురకు 840 మంది బాలికలు ఉన్నారనే విషయం విని తాను షాక్‌కు గురయ్యానని చెప్పింది. బాలిక లేకపోతే ప్రగతి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. కడుపులో ఉండగానే పసిపాపలను కడతేరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రతిఒక్కరూ ఆడపిల్ల పుడితే సాదారంగా ఆహ్వానించే రోజులు ఉండేలా ప్రజల్లో మార్పు రావాలని అభిప్రాయపడింది.