Parichayam Movie Review, in Telugu | 'పరిచయం' మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 9:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Parichayam Telugu Movie Review - Sakshi

టైటిల్ : పరిచయం
జానర్ : రొమాంటిక్‌ డ్రామా
తారాగణం : విరాట్‌ కొండూరు, సిమ్రత్‌ కౌర్‌, రాజీవ్‌ కనకాల, పృథ్వీ, సిజ్జు
సంగీతం : శేఖర్‌ చంద్ర
దర్శకత్వం : లక్ష్మీకాంత్‌ చెన్నా
నిర్మాత : రియాజ్‌

వెండితెర మీద ప్రేమకథలు ఎవర్‌గ్రీన్‌. ఏ జానర్‌ సినిమాలు సక్సెస్‌ అయినా కాకపోయినా.. సరైన కథా కథనాలతో తెరకెక్కిన ప్రేమకథలు మాత్రం ఎప్పటికీ హిట్ ఫార్ములానే. అందుకే యువ కథనాయకుల అరంగేట్రానికి ప్రేమకథలే ఫస్ట్ ఛాయిస్‌. అదే బాటలో విరాట్‌ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఎమోషనల్‌ లవ్‌ స్టోరి ‘పరిచయం’. లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌ సాధించిందా..? హీరోగా విరాట్‌ ఆకట్టుకున్నాడా..?

కథ ;
ఆనంద్‌ (విరాట్‌), లక్ష్మీ (సిమ్రత్‌ కౌర్‌) రైల్వేలో ఉద్యోగాలు చేసే సుబ్రమణ్యం (రాజీవ్‌ కనకాల), సాంబ శివరావు (పృథ్వీ)ల పిల్లలు. ఒకే రోజు ఒకే హాస్పిటల్‌లో పుట్టిన వీరిద్దరు చిన్నతనం నుంచి కలిసే పెరుగుతారు. ఒకరంటే ఒకరికి ప్రేమున్న అది చెప్పుకోకుండానే ఏళ్లు గడిచిపోతాయి. చిరవకు ఆనంద్‌ ధైర్యం చేసి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ వెంటనే విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవ అవుతుంది. అబ్బాయి అమ్మాయి కలిసి రోడ్డు మీద కనిపించటమే తప్పు అని భావించే సాంబశివరావు తన కూతురే మరో అబ్బాయితో కనిపించే సరికి రగిలిపోతాడు. (సాక్షి రివ్యూస్‌) కూతుర్ని కొట్టి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. దీంతో లక్ష్మీ చనిపోవాలని పురుగుల మందు తాగేస్తుంది. లక్ష్మీ చేసిన పనివల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..? చిరవకు ఆనంద్‌, లక్ష్మీలు ఒక్కటయ్యారా..? తల్లిదండ్రులు వారి ప్రేమను అర్థం చేసుకున్నారా..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ ;
హైదరాబాద్‌ నవాబ్స్ లాంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మీకాంత్‌ చెన్నా, విరాట్‌ను హీరోగా పరిచయం చేసేందుకు మాత్రం ఓ ఎమోషనల్‌ లవ్‌ స్టోరిని ఎంచుకున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ అని చెప్పినా.. చాలా సన్నివేశాల్లో ఇతర చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో సింహాద్రి, వసంత కోకిల సినిమాల ప్రభావం కనిపిస్తుంది. అయితే బలమైన కథను రాసుకున్న దర్శకుడు అంత ఆసక్తికరంగా తెరమీద చూపించడంలో తడబడ్డాడు. (సాక్షి రివ్యూస్‌)చాలా సన్నివేశాలను చుట్టేసిన భావన కలుగుతుంది. పురుగుల మందు తాగితే గతం మర్చిపోవటం, కరెంట్ షాక్‌ కొట్టి తిరిగి గతం గుర్తుకు రావటం లాంటి అంశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఎమోషనల్‌ డ్రామాకు మాటలు ఎంతో కీలకం కానీ పరిచయం సినిమాకు డైలాగ్సే మేజర్‌ డ్రాబ్యాక్ అయ్యాయి.

తొలి సినిమానే ఇంతటి ఎమోషనల్‌ సినిమాను ఎంచుకోవటం విరాట్ చేసిన సాహసమనే  చెప్పాలి. తన పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసినా.. అక్కడక్కడ అనుభవలేమి బయటపడుతుంది. హీరోయిన్‌గా నటించిన సిమ్రత్‌ అందంగా కనిపించింది. నటనపరంగా కూడా ఆకట్టుకుంది. రాజీవ్‌ కనకాలకు చాలా రోజుల తరువాత మంచి పాత్ర దక్కింది. తనదైన పర్పామెన్స్‌ తో సుబ్రమణ్యం పాత్రలో జీవించాడు రాజీవ్‌. పృథ్వీ పాత్ర ఆకట్టుకున్నా.. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్‌)సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్ నరేష్‌ రానా సినిమాటోగ్రఫి. అరుకు అందాలను మరింత అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. పాటలు, లోకేషన్లు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తాయి. శేఖర్‌ చంద్ర సంగీతం బాగుంది.

ప్లస్‌ పాయింట్స్‌ ;
సినిమాటోగ్రఫి
లొకేషన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
డైలాగ్స్‌
లాజిక్‌ లేని సీన్స్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement