
గతేడాది డిసెంబర్‌లో ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్‌ల వివాహం ఎంత సందడిగా జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ పెళ్లి సమయంలో ప్రియాంకా చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రాకు ‘జూతా చుపాయి’గా సందడిలో నిక్ 5 లక్షల రూపాయలను ఇచ్చినట్లు బాగా ప్రచారం జరిగింది. జూతా చుపాయీ అంటే.. పెళ్లి కొడుకు పాద రక్షలను మరదలు దాచేస్తుంది. అవి కావాలంటే బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అప్పుడు పెళ్లి కొడుకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. పరిణీతీకీ నిక్ 5 లక్షలు ఇచ్చారని బాలీవుడ్‌లో చెప్పుకున్నారు. ‘‘ఆయన ఎంత విలువైన బహుమతి ఇచ్చారో మీకు తెలీదు. నిక్ మమ్మల్ని షాక్‌కు గురి చేశారు’’ అని పెళ్లి వేడుకలప్పుడు పరిణీతి ట్వీట్ చేశారు.
ఇటీవల ఈ విషయం గురించి ఓ టీవీ షోలో పెదవి విప్పారామె. ‘‘జూతా చుపాయి అప్పుడు మా బావ నిక్ ఓ ట్రేని తీసుకురమ్మని తన బంధువులకు సైగ చేశారు. అందులో ఉన్న డైమండ్ రింగ్స్‌ను మాకిచ్చారు. అంత విలువైన బహుమతిని ఊహించలేదు. దాంతో అంతా షాక్ అయ్యారు. నిక్ ఈజ్ బెస్ట్. మా అక్కకు మంచి భర్త దొరికాడు. మంచి వ్యక్తి’’ అని బావని పొగిడారు పరిణీతి. అంటే ‘మా బావ వజ్రం’ అని చెబుతున్నట్లే కదా.