
పవన్ బాబాయ్ తిట్లే.. దీవెనలయ్యాయి
తన తొలి చిత్రం విడుదలతో మంచి ఉత్సాహం మీద ఉన్న మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ తిట్టడం వల్లే ఈరోజు తాను ఇంతవాడినయ్యానని అన్నాడు. తనతో పాటు తమ సమీప బంధువు సాయి ధరమ్ తేజ్ను కూడా ఒకరోజు పవన్ కల్యాణ్ బాబాయ్ పిలిచారని, అసలు భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా.. లేదా అంటూ తిట్టారని చెప్పాడు. సరైన ఆలోచనలతో తన వద్దకు రావాలని చెప్పి, తమకు పూర్తి స్పష్టత వచ్చేలా సాయం చేశారని అన్నాడు.
అలాగే.. తాను డాడీ అని పిలిచే మెగాస్టార్ చిరంజీవి తనకు క్రమశిక్షణ నేర్పించారని వరుణ్ తేజ్ చెప్పాడు. పరిశ్రమలో విజయాలు సాధించాలంటే క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆయనే చెప్పారన్నాడు. వరుణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా చేసిన ముకుంద సినిమా బుధవారం విడుదలైంది. దీనికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు.