నన్నంతా జూనియర్ షారుక్ అంటుంటారు - జాకీర్
పదేళ్లు.. ఎనిమిది సినిమాలు. జాకీర్ సాధించిన స్కోర్ ఇది. చేసిన సినిమాల సంఖ్య చాలా చాలా తక్కువ. కానీ జాకీర్ మాత్రం ఫేమస్. అది తన అదృష్టం అంటారాయన. జాకీర్ తొలి చిత్రం ‘బ్యాచిలర్స్’. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించి, ఆ తర్వాత ‘కుచ్చి కుచ్చి కూనమ్మ’, ‘ది ఎండ్’ తదితర చిత్రాల్లో నటించారు. ‘కుచ్చి కుచ్చి..’కి నంది అవార్డు కూడా సాధించారు. నటుడిగానే కాకుండా ‘బ్యాచిలర్స్ 2’ ద్వారా దర్శకుడిగా కూడా మారారు. ప్రస్తుతం ‘విడుదల’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నారు. ఇక... జాకీర్‌తో మాట్లాడదాం...
*** పదేళ్లల్లో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేకపోయారు.. అసంతృప్తి ఏమైనా ఉందా?
అసంతృప్తి లేదు. సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికీ ఈ రంగంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఏమీ సాధించలేకపోయాం అని బాధపడిపోవడానికి నా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడలేదు. ప్రస్తుతం వంశీగారు దర్శకత్వం వహిస్తున్న ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నాను. అంత పెద్ద దర్శకుడి సినిమాలో అవకాశం రావడం హ్యాపీ.
*** మరి.. ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు?
‘బ్యాచిలర్స్’ తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. కానీ ఏది చెయ్యాలి? ఏది వదులుకోవాలి? అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. దాంతో సినిమాల ఎంపిక విషయంలో కొంచెం పొరపాటు చేశాను. సరైన గెడైన్స్ లేకపోవడంవల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను.
*** ‘బ్యాచిలర్ 2’ ద్వారా దర్శకుడిగా మారడానికి కారణం?
నా మనసులో ఉన్న ఆలోచనలను తెరపై చూసుకోవాలనుకున్నాను. అందుకే ఆ సినిమాకి దర్శకత్వం వహించాను. ఇప్పుడు ‘విడుదల’ అనే సినిమా దర్శకత్వం వహించాను. ఇందులో నేనే లీడ్ రోల్ చేశాను. జైలు నుంచి విడుదలైన తర్వాత, ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది ఈ చిత్రం కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.
*** ఒకవైపు డెరైక్షన్.. మరోవైపు యాక్టింగ్.. ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యం?
కచ్చితంగా నటనకే. యాక్టింగ్ మీద ఇంట్రస్ట్‌తోనే పరిశ్రమకు వచ్చాను. మంచి కథ కుదరడంతో ‘బ్యాచిలర్స్ 2’కి, ఇప్పుడు ‘విడుదల’కు దర్శకత్వం వహించాను. ఇకముందు ఎప్పుడైనా మంచి కథ కుదిరితే డెరైక్షన్ చేస్తాను. ప్రధానంగా యాక్టింగ్‌పైనే దృష్టి.
*** హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమేనా.. విలన్‌గా చేసే ఉద్దేశం ఉందా?
చేయాలనే ఉంది. మన తెలుగు పరిశ్రమలో తెలుగు మాట్లాడే విలన్లు పెద్దగా లేరు. నాలాంటి వాళ్లకి అవకాశం ఇస్తే.. విలన్‌గా కూడా నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం.
*** మీరు జూనియర్ షారుక్ ఖాన్‌లా ఉంటారని ఎవరైనా అన్నారా?
చాలామంది అంటుంటారు. బాలీవుడ్ బాద్‌షా అనిపించుకున్న షారుక్‌తో పోల్చడం ఆనందమే.