
సినీ డైరెక్టర్ అమీర్
సాక్షి, పెరంబూరు: సినీ దర్శకుడు అమీర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంఘటన కలకలానికి దారి తీసింది. దర్శకుడు అమీర్ ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా, నటుడు రజనీకాంత్ ఆ పార్టీకి అనుకూలగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవైలోని ఒక కల్యాణ మండపంలో శుక్రవారం రాజకీయ చర్చావేదిక జరిగింది. అందులో దర్శకుడు అమీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్, కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుడు తనియరసు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అమీర్ వ్యాఖ్యలకు బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెబుతూ కలకలం సృష్టించారు. దీంతో నిర్వాహకులు అమీర్‌ను క్షేమంగా ఆయన బస చేసిన హోటల్‌కు పంపించేశారు. శుక్రవారం రాత్రి కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకులు కారులో కరుమత్తంపట్టి ఊరికి వెళుతుండగా ముదలిప్పాలయం సమీపంలో కొందరు బీజేపీ కార్యకర్తలు ఒక కారులో దర్శకుడు అమీర్ ఉన్నట్లు భావించి దాన్ని అడ్డగించి రాళ్లు, గడ్డపారలతో దాడి చేశారు.
దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ అనూహ్య పరిణామానికి కారులో పయనిస్తున్న కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకులు భయ భ్రాంతులై కిందికి దిగారు. వారిలో దర్శకుడు అమీర్ లేకపోవడంతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వ్యవహారంపై కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కరుమత్తంపట్టి డీఎస్‌పీ జయచంద్రన్ విచారణ జరుపుతున్నారు.