ఇక స్టార్ హీరోల చిత్రాలు కాస్టిలీ గురూ!
పెరంబూరు: సినిమా ప్రేక్షకుడిపై టికెట్ల ధరల మోతే. ఇకపై సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్, విజయ్,అజిత్ వంటి వారు నటించిన చిత్రాలు చూడాలంటే సాధారణ ప్రేక్షకుడికి అసాధ్యం కానుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం అమలు పరచిన జీఎస్‌టీ పన్నుతో సినిమా టికెట్లపై 18 నుంచి 28 శాతం వరకూ భారం పడుతోంది.
అంటే రూ. 120 టికెట్ రూ. 153కూ రూ. 100 టికెట్ రూ. 118కూ పెరిగిపోయింది.దీనికి తోడు రాష్ట్రప్రభుత్వం అదనంగా వినోదపు పన్నును 30 శాతం విధించడానికి సిద్ధం కావడంతో ఈ పన్నును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్ల యాజమాన్యం సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం చర్చలకు పిలుపు నివ్వడంతో థియేటర్ల మాజమాన్యం సమ్మెను విరమించకుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక బృందం, సినీ పరిశ్రమ తరఫున ఒక బృందం ఏర్పాటు చేసి వినోదపు పన్ను విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఇదిమిద్ధంగా ఒక కొలిక్కి రాకపోయినా ప్రస్తుతం కోల్‌కొతా, బెంగళూరు వంటి నగరాల్లో సినిమా థియేటర్ల టికెట్ల విషమంలో ఒక కొత్త విధానం అమలులో ఉంది. అక్కడ స్టార్ హీరోల చిత్రాలకు వార చివరి రోజుల్లో అధిక ధరను వసూలు చేస్తున్నారు.
ఇతర రోజుల్లో సాధారణ ధరలను వసూలు చేస్తున్నారు.అదే విధానాన్ని తమిళనాడులో అమలు పరచే విషయంలో రాష్ట్రప్రభుత్వానికి,చిత్ర పరిశ్రమకు చెందిన వారికి మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది.అదేవిధంగా స్టార్ హీరోలు రజనీకాంత్,కమలహాసన్, విజయ్,అజిత్ వంటి వారి చిత్రాలకు అదనంగా టికెట్ ధరను వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం చెన్నైలో టికెట్ ధరను రూ.50 నుంచి రూ.160 వరకూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఇతర ప్రాంతాల్లో రూ. 140 వరకూ వసూలు చేసుకోవచ్చని సమాచారం.ఈ ధరలకు అధనంగా రూ. 100లకు పైగా ఉన్న ధరలపై జీఎస్‌టీ పన్ను 28 శాతం, అందుకు తక్కువ టికెట్ ధరపై 18 శాతం పడుతుంది. ఉదాహరణకు రూ. 160 టికెట్ ధర పై 28 శాతం జీఎస్‌టీ పన్ను కలిపితే రూ.205 అవుతుంది.దీనికి ఆన్‌లైన్ బుక్కింగ్ అయితే మరో రూ.30 చార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అంటే రూ.235 అవుతుంది. దీనికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్న చిత్ర పరిశ్రమకు చెందిన ఒకాయన తెలుపుతూ స్టార్స్ చిత్రాలకు టికెట్ ధర పెంచే విషయం గురించి చర్చల్లో ఆమోద ముద్ర పడినట్లు తెలిపారు.అయితే త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆ తరువాత కొత్త ధరలు అమలవుతాయని చెప్పారు.అదే విధంగా అనువాద చిత్రాలకు 10 నుంచి 15 శాతం వినోదపు పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు చెప్పారు.
ఇంకా చర్చల్లోనే ఉంది
కాగా తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ఈ విషయమై మాట్లాడుతూ సినిమా టికెట్ల ధర పెంపు విషయం ఇంకా చర్చల్లోనే ఉందని చెప్పారు.తుది నిర్ణయం జరగలేదని అన్నారు.అయితే సినిమా టికెట్ల ధరను పెంచుకునే అధికారం ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికే ఇచ్చిందని తెలిపారు.కోల్‌కొతా, బెంగళూరు వంటి నగరాల్లో వార చివరి రోజుల్లో టికెట్లపై అధిక ధరలను వసూలు చేసే విధానాన్ని చెన్నైలో ఎందుకు అమలు పరచరాదని ఆయన ప్రశ్నించారు.మొత్తం మీద సగటు ప్రేక్షకుడికి ఇకపై సినిమాలు చుక్కల్ని చూపించబోతున్నాయన్నది వాస్తవం.