
తెరపై... 18 ఏళ్ల తర్వాత!
దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై నటించడానికి పూజా భట్ సిద్ధం అవుతున్నారు. ‘జిస్మ్’ చిత్రంతో దర్శక, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావడం హిందీ సీమలో చర్చనీయాంశమైంది. పూజాభట్ 1990లోనే ‘డాడీ’ చిత్రంలో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2001లో ‘ఎవ్రీ బడీ సేస్ ఐ యామ్ ఫైన్’ తర్వాత మళ్లీ ఏ చిత్రంలోనూ కనిపించలేదామె.
విశేషం ఏమిటంటే, ఆమె నటించిన తొలి చిత్రం ‘డాడీ’కి మహేశ్‌భట్ కథ అందించి, దర్శకత్వం వహించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆమె నటించనున్న కొత్త చిత్రానికి కూడా కథారచయిత మహేశ్‌భటే. అప్పట్లో వచ్చిన ‘డాడీ’ చిత్రం ఓ తండ్రికి, కూతురికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో సాగితే, ఈ సినిమా మాత్రం అందుకు రివర్స్ అట. ఇందులో ఓ తల్లికీ, కూతురికీ మధ్య అనుబంధాన్ని తెరకెక్కించనున్నారు.
‘‘మా నాన్నగారు ఎప్పుడైతే డెరైక్షన్ ఆపేశారో, నేను అప్పుడే నటన నుంచి తప్పుకున్నాను. అయితే ఇప్పుడు మంచి మంచి కథలు తెరపై చెబుతున్నారు. అందుకే ఇప్పుడీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను’’ అని చెప్పారామె.