
పెళ్లి తేదీ దగ్గర పడటంతో పెళ్లి పనులు ముమ్మరం చేశారు ‘ప్రియానిక్’ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్). డిసెంబర్ 3న జో«థ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. నవంబర్ 28న సంగీత్‌తో వీరి షాదీ సంబరాలు మొదలవుతాయట. ఈ సంగీత్ కార్యక్రమంలో నిక్ పాటలతో అలరించనున్నారట. అలాగే ఈ ఇద్దరూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‌కు కాలు కదపనున్నారట. దీనికోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ హెగ్డేను ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం ప్రియాంక తన కొత్త చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నవంబర్ 26 వరకూ ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత పెళ్లి కోసం బ్రేక్ తీసుకుంటారు. పెళ్లికి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రియాంక ప్రియ మిత్రురాలు, హాలీవుడ్ నటి, ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిని మేఘన్ మార్కెల్ మాత్రం ఈ వేడుకకు రాలేరని సమాచారం. ఆమె వివాహ వేడుకకు ప్రియాంక హాజరయ్యారు. మరి.. మేఘన్ ఎందుకు రారంటే.. ఆమె గర్భవతి అని సమాచారం.
మాకేం కావాలంటే..
సాధారణంగా పెళ్లికి ఏం బహుమతులు తీసుకువెళ్లాలో అని తర్జన భర్జన పడుతుంటారు బంధువులు, సన్నిహితులు. కానీ తన పెళ్లికి హాజరయ్యేవాళ్లకు అలాంటి ఇబ్బందేం పెట్టదలచుకోలేదు ప్రియాంక. తమకేం కావాలో చిట్టీ రాసి మరీ వివరంగా చెప్పారు. దీన్నే ‘బ్రైడల్ రిజస్ట్రీ’ అంటారు. ఈ పద్ధతి విదేశాల్లో చాలా కామన్. అంటే తమకు ఏం కావాలో వాటన్నింటినీ లిస్ట్ రాసి పెళ్లికి బహుమతులు తీసుకురావాలనుకున్న వాళ్ల శిరోభారం తగ్గిస్తుంటారు వధూవరులు. టీవీ, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటివి మాత్రమే కాకుండా తన పెంపుడు కుక్క డయానా కోసం పింక్ కలర్ రెయిన్ కోట్, జీపీయస్ ట్రాకర్, పెట్ బెడ్ కూడా లిస్ట్‌లో ఉంచారు ప్రియాంక. దీనిని అమేజాన్ షాపింగ్ సైట్‌లో ఉంచారు. ఈ బ్రైడల్ రిజస్ట్రీలో సేవాభావం కూడా ఉంది. ఈ వెడ్డింగ్ రిజిస్ట్రీ ద్వారా యూనిసెఫ్ సంస్థకు లక్ష డాలర్లు విరాళంగా ఇవ్వనున్నారు అమేజాన్ వాళ్లు.
Comments
Please login to add a commentAdd a comment