చిరు సరసన వాళ్లిద్దరిలో ఎవరో?
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఉయ్యలవాడ నర్సింహారెడ్డిలో ఆయనకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన కథనాయికగా పలువురు బాలీవుడ్ భామల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు సోనాక్షి సిన్హా లేదా ప్రియాంకా చోప్రాను నటింపచేసేందుకు చిత్ర యూనిట్ యత్నిస్తున్నట్లు సమాచారం.
అంగీకారం కోసం చిత్ర నిర్మాతలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోనాక్షి సిన్హా రజనీకాంత్ సరసన లింగా చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ... ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేయాలని కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అమ్మడు పచ్చజెండా ఊపలేదు. అంతేకాకుండా ఇటీవలే మహేష్ బాబు చిత్రంలో ఛాన్స్ వచ్చినా తిరస్కరించినట్లు ఆమె వెల్లడించింది కూడా.
ఇక ప్రియాంకా చోప్రా కూడా రాంచరణ్‌తో హిందీ చిత్రం జింజర్ (తెలుగులో తుఫాను)లో కలిసి నటించిన విషయం తెలిసిందే. మరోవైపు చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి... ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో భేటీ అయ్యారు. అయితే రెహమాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తి కాగా ఆగస్ట్, లేదా సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ లోపు చిత్ర యూనిట్ హీరోయిన్‌ను ఫైనలైజ్ చేయనుంది. కాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ముగ్గురు మహిళలు ముఖ్య భూమిక పోషించారట! ఆ ముగ్గురిలో ఓ పాత్రకు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను అనుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అలాగే చిరంజీవితో పలు హిట్ చిత్రాలు చేసిన విజయశాంతిని ఓ పాత్రకు, శ్రుతీహాసన్‌ను మరో పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.