నటుడు అలోక్‌నాథ్, రచయిత వింటా నందా(ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో ‘మీటూ’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీ, మీడియా రంగాల్లో వరసగా ఒక్కొక్కరు తమ భయంకరమైన అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఈ కీచక పర్వంలో మరిన్ని చీకటి కోణాల్ని బహిర్గతం చేశారు. హృదయ విదారకమైన అనుభవాన్ని రెండు దశాబ్దాల తన మూగ వేదనను షేర్ చేశారు. ఇపుడు చాలామంది మహిళలు లైంగిక వేధింపులపై బయటికి వస్తున్నారు. 19ఏళ్లుగా నేను ఈ సమయంకోసం వేచి చూస్తున్నాను అంటూ ఫేస్‌బుక్‌లో భయంకరమైన విషయాలను వెల్లడించారు.
సుదీర్ఘమైన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన వ్యక్తి సినీ, టీవీ టెలివిజన్ నటుడు అలోక్‌నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని వింటా నందా ఆరోపించారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్‌గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో తారా (ఈ షో రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా) ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. ఆయనొక తాగుబోతు, దుర్మార్గుడు కానీ ప్రముఖ సంస్కారవంతమైన నటుడిగా చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండడం వల్ల పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. తాను మరింత నష్టపోయానంటూ ఆమె నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు.
లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలను అభినందించిన వింటా ఇదే సరైన సమయం మీరు ఎదుర్కొన్న వేధింపులపై గొంతెత్తి అరవండి. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు.
అలోక్‌నాథ్‌కు నోటీసులు
మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం (సీఐఎన్‌టీఏఏ) అలోక్‌నాథ్‌కు నోటీసులు జారీ చేసింది. వింటా నందా ఆరోపణలపై వివరణ యివ్వాల్సిందిగా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment