'నీ సినిమాలు పాక్లోనే విడుదల చేస్కో'
ఇండోర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఆయన పుట్టిన ఊర్లోనే నిరసన పర్వం మొదలైంది. ఆయన పాకిస్థాన్ నటులకు మద్దతిచ్చేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ విద్యార్థి విభాగం కార్యకర్తలు ఇండోర్ లోని రాజ్ బదా ప్రాంతంలో ఆందోళన చేపట్టారు.
'భారతీయ అభిమానుల వల్లే సల్మాన్ నేడు గొప్పవాడిగా ఎదిగాడు. పాకిస్థాన్ నటులకు మద్దతిస్తున్నానంటూ ప్రకటించిన సల్మాన్ వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి' అంటూ బజరంగ్ దళ్ డివిజనల్ కన్వీనర్ సచి బాగేల్ ఆధ్వర్యంలోని స్టూడెంట్ వింగ్ డిమాండ్ చేసింది. ఒక వేళ సల్మాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ఆయన తీస్తున్న సినిమాలు పాకిస్థాన్లో విడుదల చేసుకోవాలని, భారత్ లో విడుదల చేయొద్దని అన్నారు. 'పాకిస్థాన్ ఆర్టిస్టులు తీవ్రవాదాన్ని ఖండిస్తే మేం వారికి స్వాగతం పలుకుతాం. లేదంటే వారిని భారత్ లోకి అనుమతించేది లేదు' అంటూ మండిపడ్డారు.