
భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా వర్థమాన నటుడికి బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
అవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. మంచి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు అలాంటి ఛాన్సే భద్రం అనే యువకుడికి వచ్చింది. ఏకంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనకు తానుగా ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఈ అవకాశం ఎలా వచ్చిందంటే... 'పెళ్లితో జర భద్రం' అంటూ ఆ యువకుడు ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. పెళ్లైన తర్వాత జీవితం ఎలావుందో ఇందులో ఏకరువు పెట్టాడు. భార్యా బాధితుడిగా తన హావభావాలతో బాధను వెళ్లబోసుకున్నారు. పెళ్లి మాత్రం చేసుకోవద్దంటూ హితవు చెప్పాడు.
అక్కడితో ఆగకుండా ఈ షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో పెట్టాడు. పూరి జగన్నాథ్ ఈ వీడియోను చూడడమే కాకుండా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. నీలాంటి నటుడు నాకు కావాలంటూ సందేశం పంపారు. తనను కలవాలని లేకుంటే వివరాలు పంపాలని భద్రంకు ఫేస్బుక్ మెసేస్ పెట్టారు. వర్థమాన నటుడికి పూరి జగన్నాథ్ అవకాశం ఇవ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల.. భద్రంకు అభినందనలు తెలిపారు.