తమిళసినిమా: శాండిల్‌వుడ్ వర్ధమాన నటి రాధిక ప్రీతి కోలీవుడ్‌లో పేరు తెచ్చుకోవాలని ఆశ పడుతోంది. ఈమె తండ్రి కన్నడిగుడైనా, తల్లి మాత్రం తమిళనాడుకు చెందినవారేనట. కర్ణాటకలోని కోలార్‌లో పుట్టి పెరిగిన రాధికప్రీతి తమిళభాషను సరళంగా మాట్లాడగలదట. అంతేకాదు తమిళ భాష అన్నా, తమిళ చిత్రాలు అన్నా చాలా ఇష్టం అంటోంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన కన్నడ చిత్రం రాజా లవ్స్ రాధే చిత్రం విడుదలై మూడవ వారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోందట. తాజా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ నటించిన ఎంబిరాన్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. నినైత్తది యారో చిత్రం ఫేమ్ రెజీత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కృష్ణన్ పాండి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈయన దర్శకుడు మహిళ్ తిరుమేని శిష్యుడన్నది గమనార్హం. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ థ్రిల్లర్‌తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఎంబిరాన్ చిత్రం ఉంటుందన్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, జూలైలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. పంజవర్ణం ఫిలింస్ పతాకంపై పంజవర్ణం నిర్మిస్తున్న ఈ చిత్రంపై నటి రాధిక ప్రీతి చాలా ఆశలు పెట్టుకుందట. దీని గురించి ఆమె తెలుపూ ఎంబిరాన్ చిత్రం నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని, తమిళంలో పలు చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నట్లు అంటోంది. మోడ్రన్ పాత్రల్లో నటించడం తనకు ఇష్టమేనని, అయితే ఆ పేరుతో అందాలారబోతకు మాత్రం అంగీకరించనని అంది. మంచి కథలతో వచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తున్నట్లు రాధికా ప్రీతి చెప్పింది. ఎంబిరాన్ చిత్రానికి ప్రసన్ బాలా సంగీతాన్ని అందించారు. ఈయన ఇంతకు ముందు యాగవరాయినుం నా కాక్క చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. పుహళేంది ఛాయాగ్రహణం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment