‘‘1978లో నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది. పది పదిహేను సినిమాలు చేశాను. ‘అంతులేని కథ, తొలి రేయి’... సినిమాలు చేశాను. బ్రేక్ వచ్చింది. తెలుగులో సినిమాలు చేయాలా తమిళంలో సినిమాలు చేయాలా అనే క్వశ్చన్ వచ్చింది. నన్ను బాలచందర్‌గారు ఫస్ట్ తమిళంలో పరిచయం చేశారు. తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాను. తమిళ వాళ్లు ఎంత ప్రేమ చూపించారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమను చూపించారు. అది నా భాగ్యం’’ అని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ హీరోగా హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావ్, నానా పటేకర్, సముద్రఖని ముఖ్య తారలుగా వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకుడు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో మోహన్‌బాబు ‘పెదరాయుడు’తో నాకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ‘భాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ ఇలా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు.
హైదరాబాద్ ఎప్పుడొచ్చినా అన్నగారు ఎన్టీఆర్‌గారిని కలిసి ఆశీర్వాదం తీసుకునేవాణ్ణి. ఇప్పుడు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకో మీకు తెలుసు (తాను రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని ఉద్దేశించి). గురువుగారు బాలచందర్‌గారు, దాసరిగారిని గుర్తు చేసుకుంటున్నాను. గొప్ప దర్శకులు అని మనకు తెలియనిది కాదు. దాసరిగారు నన్ను బిడ్డలా చూసుకునేవారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి అని కోరుకుంటున్నాను. ధనుష్ ఇందాక ‘ఒక్కరే రజనీకాంత్’ అన్నాడు. ఒక్కరే చిరంజీవి. ఒక్కరే నాగార్జున, ఒక్కరూ వెంకటేశ్, ఒక్కరే బాలకృష్ణ. అన్నింటికంటే అవకాశం చాలా గొప్పది. అవకాశం రావడం ముఖ్యం. దేవుణ్ణి నమ్మనివారు లక్ అంటారు, నమ్మే వాళ్లు దైవబలం, దేవుని ఆశీర్వాదం అంటారు. నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను. కష్టపడి శ్రమించాను. ఫలితం దొరుకుతోంది. ‘కబాలి’ సినిమాకి దర్శకుడు పా. రంజిత్‌కి అవకాశం ఇచ్చినప్పుడు ‘ఎందుకు అంత కొత్త కుర్రాడు’ అని అన్నారంతా. అతను సినిమా తీసే విధానం నాకు నచ్చింది.
మళ్లీ నా అల్లుడు ధనుశ్‌తో కలిసి తనతోనే రెండో సినిమా చేశా. మొన్నే ‘కాలా’ సినిమా చూశా. చాలా బావుంది. కమర్షియల్‌గా కంటే కూడా మెసేజ్ ఇస్తుంది. రియాలిటీ ఉంటుంది. రంజిత్ బాగా ప్రజెంట్ చేశాడు. ఆసియాలోనే పెద్ద స్లమ్ ధారావీ. అక్కడివాళ్లు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? అనే ఐడియాని సినిమాలో చూపిస్తున్నాం. సాధారణంగా సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కానీ ‘కాలా’లో 5–6 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది సినిమా. ధారావీలోని జనం స్ట్రగుల్ ఏంటి? అనే విషయాన్ని చూపించాం. సంతోశ్ నారాయణ్ ఈజ్ బెస్ట్. క్లాసీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈశ్వరీ రావ్ తెలుగమ్మాయే. చాలా బాగా చేసింది. హ్యూమా ఖురేషి ఎంతో ఓపికగా ఉన్నారు. ముంబై నుంచి చైన్నై రావడం. బాగా సహకరించారు. హ్యాట్సాఫ్. ధనుష్ మంచి నటుడు అని తెలుసు. కానీ నిర్మాతగా ఎలా చేస్తాడా? అని అనుకున్నాను. నిర్మాతగా కూడా ప్రూవ్ చేçసుకున్నాడు. ఈ సినిమా డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
ధనుష్ మాట్లాడుతూ – ‘‘కాలా’ జనం సినిమా. వాళ్ల మీద తీసిన సినిమా. వాళ్ల కోసం తీసిన సినిమా. బోల్డ్‌గా, రీసెర్చ్ చేసి తీసిన సినిమా. కేవలం ధారావి అనే కాదు ప్రపంచంలో అణగారిపోతున్న వాళ్ల గురించి చెప్పే సినిమా. వాళ్లందర్నీ లీడ్ చేయడానికి ఒక లీడర్ కావాలి. రజనీకాంత్ కంటే ఇంకెవరున్నారు? 40 ఏళ్లుగా రజనీకాంత్‌గారి మీద ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. చాలా మంది నెక్ట్స్ రజనీకాంత్ అవ్వాలని స్ట్రగుల్ అవుతున్నారు. దానికి ఫార్ములా లేదు. ఒక్కరే రజనీకాంత్. మన దేశం గర్వించేలా చేస్తున్నారు రజనీకాంత్‌గారు. తెలుగు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రజనీగారి సినిమా గురించి మాట్లాడే స్థాయి లేదు. 1999లో డిస్ట్రిబ్యూటర్‌గా ‘నరసింహా’ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశా. ఆ సక్సెస్‌ని ఎంత ఎంజాయ్ చేశానో రత్నంగారికి తెలుసు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత ‘కాలా’ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. మామ హీరోగా అల్లుడు ధనుష్ తీసిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ‘కబాలి’ సక్సెస్‌ను పట్టించుకోకుండా రజనీగారు రంజిత్‌కు మళ్లీ చాన్స్ ఇవ్వడం గ్రేట్’’ అని చెప్పారు. రంజిత్ మాట్లాడుతూ – ‘‘కాలా సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రజనీకాంత్ యాక్షన్ మనందర్నీ అలరిస్తుంది. సినిమా మొత్తం పాలిటిక్స్ మాట్లాడుతుంది. మా ఐడియాలజీ మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ల్యాండ్ ఇష్యూని డిస్కస్ చేశాం. వాళ్ల కష్టాల్ని చూపించాం’’ అన్నారు.
ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారు నాకు భగవంతుడితో సమానం. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఎంతో ఇష్టంతో చేసిన ‘బాబా’ను నాకు తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చారు. వారం తర్వాత ఎలా ఆడుతుందని అడిగారు. ఆ తర్వాత నెలరోజులకి రమన్నారు. మొత్తం లెక్కలు చూస్తే.. కోటీ అరవై లక్షలు నష్టం వచ్చింది. దానికి ఇంకో లక్ష కలిపి ఇచ్చారు. లక్ష రూపాయిలు ప్రాఫిట్ అన్నారు. ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నో సంచలనాలకు కారకుడు అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్ అంటే సక్సెస్, సింపుల్, స్టైల్. ఇవన్నీ అందరికీ ఇన్‌స్పిరేషన్. ‘అరుణాచలం, నరసింహా’ సినిమాలు తెలుగులో రిలీజ్ చే శా. రజనీని దేశంలో ఎవరైనా ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని రంజిత్ న్యాచురల్, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో తీశారు. కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు.‘‘ఈ అవకాశం ఇచ్చిన రజనీకాంత్‌గారికీ, ధనుష్, రంజిత్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో భాగం అయినందుకు హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు హ్యూమా ఖురేషీ. ‘‘ కాలా సినిమా స్లమ్ గురించి మాట్లాడుతుంది. రజనీకాంత్‌గారితో మళ్లీ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ’’ అన్నారు సంతోష్ నారాయణ్.
అన్నింటికంటే అవకాశం గొప్పది: రజనీకాంత్
Published Tue, Jun 5 2018 12:23 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment