మథురలో ఆందోళన చేస్తున్న రాజ్‌పుత్ వర్గీయులు
న్యూఢిల్లీ/జైపూర్: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ చిత్రం విడుదలపై రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా జనవరి 25న పద్మావత్ చిత్ర ప్రదర్శనకు అనుకూలంగా ఇంతకుముందు ఇచ్చి న తీర్పును వెనక్కి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాయి.
ఇరురాష్ట్రాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం, ఈ మధ్యంతర పిటిషన్లను మంగళవారం విచారించేందుకు అంగీకరించింది. పద్మావత్ చిత్ర ప్రదర్శనపై గుజరాత్, రాజస్తాన్ ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని ఈ నెల 18న కోట్టేసిన సుప్రీం.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు అనుమతిచ్చింది. ఈ సినిమా బృందంతో పాటు ప్రేక్షకులకు సైతం రక్షణ కల్పించాలనీ, చిత్ర ప్రదర్శనను అడ్డుకునే చర్యలు తీసుకోరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
పద్మావత్ చిత్రం విడుదలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రాజస్తాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో నిర్వహించిన ‘స్వాభిమాన్ ర్యాలీ’లో రాజ్‌పుత్ మహిళలు కత్తులు పట్టుకుని భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలను నిషేధించకపోతే ఆత్మగౌరవంతో చనిపోవడానికి వీలుగా యాక్టివ్ యూథనేషియా (అనాయాస మరణం)కు అనుమతించాలని వీరు రాష్ట్రపతికి లేఖ రాయాలని నిర్ణయించారు. పద్మావత్ చిత్రం విడుదలను నిలిపివేయకుంటే రాణి పద్మిని తరహాలోనే తామంతా ఆత్మాహుతి చేసుకుంటామని జోహర్ క్షత్రానీ మంచ్ కార్యదర్శి సంగీతా చౌహాన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment