సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ‘పద్మావత్’ బాలీవుడ్ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని అనుకుంటున్న సమయంలో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను నిషేధించారు. ఆది నుంచి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, వ్యయ ప్రయాసాలకోర్చి సినిమాను పూర్తి చేసిన నిర్మాతలకు సెన్సార్ బోర్డు తలనొప్పులు కూడా తప్పలేదు. (సాక్షి ప్రత్యేకం) చివరకు బోర్డు సూచన మేరకు పద్మావతి పేరును పద్మావత్‌గా మార్చగా ఐదు కట్లతో సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు యూ–ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న సినిమా దర్శక, నిర్మాతలు ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి.
సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి మంజూరు చేశాక సినిమా విడుదలను అడ్డుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఉంటే అది న్యాయబద్ధమే అవుతుందా? ఈ అంశాలను తేల్చుకునేందుకే సినిమా నిర్మాతలు బుధవారం నాడు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) వెబ్‌సైట్ ప్రకారం సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం కనుక సినిమా ఆటోగ్రపీ చట్టం–1952 నిబంధనలను అమలు చేసే అధికారం కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే. ఈ కారణంగా తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను (ఆందోళనలను) పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు అధికారం ఉందనే విషయం స్పష్టమవుతుంది. (సాక్షి ప్రత్యేకం)
సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌గా ప్రసూన్ జోషిని కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వమే నియమించింది. ( సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సెన్సార్ బోర్డును లెక్క చేయక పోవడం కాదా? ఓ ప్రజాస్వామ్య సంస్థ ఉనికికే ప్రమాదం తీసుకరావడం కాదా? సొంత పార్టీ ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌ను అవమానించడం కాదా? సెన్సార్ బోర్డు తొందరపడి సినిమా విడుదలకు నిర్ణయమేమీ తీసుకోలేదు.
కేంద్ర పార్లమెంటరీ ప్యానెల్, చరిత్రకారుల కమిటీ ఆమోదంతోనే సినిమా విడుదలకు సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ కారణంగా బీజేపీ సీఎంల ప్రవర్తన పార్లమెంటరీ ప్యానల్ అభిప్రాయాన్ని కూడా అగౌరవపర్చడమే అవుతుందికదా? సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం అనేదే తమకు ప్రాతిపదికగా భావిస్తే ఇక రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సినిమాల విషయాల్లో తమ ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదకర పరిస్థితులకు దారితీయదా? తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగదా?(సాక్షి ప్రత్యేకం)
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి అడుగడుగున సినిమా నిర్మాతలకు అడ్డం పడడం, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడి చేయడం, హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తే లక్షల రూపాయలు ఇస్తాననడం, హీరోలు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌లను బెదిరించడం, సినిమా పేరు మార్చినంత మాత్రాన సినిమాను అనుమతించాలని ఎక్కడైన ఉందా? అంటూ సాక్షాత్తు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రశ్నించడం, సెన్సార్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖతోపాటు ప్రధాని కార్యాలయం మౌనం వహించడం తదితర అన్ని పరిణామాలు భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కడమే అవుతుంది. మరి సుప్రీం కోర్టు సినిమా ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు రాష్ట్రాల పరిధిలోనివి అంటుందా? సమాఖ్య స్ఫూర్తి, భావ ప్రకటనా స్వేచ్ఛను దష్టిలో పెట్టుకొని తీర్పు చెబుతుందా? చూడాలి!((సాక్షి ప్రత్యేకం)
Comments
Please login to add a commentAdd a comment