
రజనీకాంత్ హీరోగా నటించిన, ‘కాలా’ చిత్రం మొత్తం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. తాజాగా రజనీ చేయబోయే సినిమాలో కూడా అదే నేపథ్యం ఉంటుందని సమాచారం. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను ముంబైలో ప్లాన్ చేశారట దర్శకుడు. దాంతో కథ ముంబై నేపథ్యంలో ఉంటుందని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఎ.ఆర్. మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ సినిమాకి కూడా ముంబై టచ్ ఉంటుంది.
మరి.. తాజా చిత్రకథను పూర్తిగా ముంబైలో నడిపిస్తారా లేక కథలో కీలక సన్నివేశాలు మాత్రమే ఆ మహానగరంలో ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది. త్వరలో చిత్రబృందం ముంబై వెళ్లడానికి రెడీ అవుతోందట. చెన్నైలో ముంబై సెట్ వేసి కూడా కొన్ని సీన్స్ తీయాలనుకుంటున్నారట. ఇందులో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని భోగట్టా. రెండు పాత్రల్లో ఒకటి పోలీస్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నయనయనతారను ఓ కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. మరో కథానాయికగా కీర్తీ సురేష్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్ వ్యవహరిస్తారు.