అలాంటి డైలాగ్ చెబుతారా?
‘ఈ భాషా ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే’ – ఇరవైయేళ్ల క్రితం విడుదలైన ‘భాషా’లోని ఈ డైలాగ్ ఇప్పటికీ జనాలకు గుర్తే. మరో ఇరవై కాదు.. వందేళ్లు గడిచినా ‘భాషా’ సినిమా, అందులో రజనీకాంత్ యాక్టింగ్, ఆయన డైలాగులను ప్రేక్షకులు మర్చిపోరంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘భాషా’తో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు రజనీ. ముంబై మాఫియా నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే ఆయన ఫ్యాన్స్‌కి ‘భాషా’ గుర్తొస్తుంది. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... మళ్లీ ముంబై నేపథ్యంలో రజనీ సినిమా చేయనున్నారట! రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ముంబై నేపథ్యంలో ఉంటుందట! అండర్‌వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఇటీవల రజనీకాంత్, దర్శకుడు పా. రంజిత్, మరికొంత మంది యూనిట్ సభ్యులు ముంబై వెళ్లి లోకేషన్స్ ఫైనలైజ్ చేశారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. ఆల్రెడీ ‘కబాలి’లో రజనీకాంత్‌ని గ్యాంగ్‌స్టర్‌గా చూపించి ఆయన అభిమానులను పా. రంజిత్ ఖుషీ చేశారు. ఇప్పుడు ముంబై నేపథ్యం అనగానే, రజనీ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకోసారి అభిమాన హీరో ‘ఈ భాషా ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే’ అనే రేంజ్ డైలాగ్ చెబితే చూడాలని ఆశపడుతున్నారు. మరి, అలాంటి డైలాగ్ ఉంటుందా? వెయిట్ అండ్ సీ!