కేక పుట్టిస్తున్న రజనీ
‘రోబో’ వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతవరకూ రజనీకాంత్ సినిమా రాలేదు. దక్షిణాది ప్రేక్షకులు, ముఖ్యంగా రజనీ అభిమానులు తమ అభిమాన కథానాయకుణ్ణి వెండితెరపై చూడాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ లోటు తీర్చడానికే ‘కోచ్చడయాన్’ వస్తోంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మాట్‌లో ఈ సినిమా తయారవుతోంది.
ఇండియాలో ఈ పరిజ్ఞానం ఉపయోగించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. రజనీ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు కావడం మరో విశేషం. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికాపదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదల కోసం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కోచ్చడయాన్’ చిత్ర ప్రచార చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సోమవారం ఇంటర్‌నెట్‌లో విడుదల చేశారు.
ఈ ప్రచార చిత్రాన్ని 12 గంటల్లో నాలుగు లక్షల మంది అభిమానులు వీక్షించడం విశేషం. రజనీకాంత్ రాజు గెటప్‌లో గుర్రపుబండితో స్వారీ చేయడం, పోరుభూమిలో శత్రువులను చీల్చి చెండాడడం, స్టైలిష్‌గా స్టెప్పులు వేయడం వంటి సన్నివేశాలు అభిమానులను కేరింతలు కొట్టిస్తున్నాయి. ‘కోచ్చడయాన్’ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో శ్రీ లక్ష్మీ గణపతి సంస్థ విడుదల చేయనుంది.