Rakshasudu Movie Review, in Telugu|‘రాక్షసుడు’ మూవీ రివ్యూ | Sai Srinivas Bellamkonda, Anupama Parameswaran, Ramesh Varma - Sakshi
Sakshi News home page

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

Published Fri, Aug 2 2019 1:38 PM | Last Updated on Fri, Aug 2 2019 8:55 PM

Rakshasudu Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : రాక్షసుడు
జానర్‌ : సస్పెన్స్‌ క్రైమ్‌ థిల్లర్‌
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం : గిబ్రాన్‌
నిర్మాత : కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం : రమేష్‌ వర్మ

మాస్‌ ఫాలోయింగ్‌ పెంచుకుందామని రొటీన్‌ సినిమాలను చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఈ సారి మాత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్‌(తమిళ మూవీ రాక్షసన్‌)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ హీరోకు.. విజయం లభించిందా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ
స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) సినీ రంగంలో తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటాడు. దర్శకత్వం చేపట్టాలని ప్రతీ ఆఫీస్‌ గడప తొక్కుతూ ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కోసం ప్రపంచంలో నలుమూలలా జరిగే సైకో హత్యల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే అరుణ్‌కు సినీ రంగంలో అవకాశాలు రాక.. చివరకు కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్‌ ఉద్యోగంలో చేరతాడు. అరుణ్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ అయిన తరువాత మళ్లీ ఓ హత్య జరగుతుంది. ఇక ఆ హత్యలను చేసేది ఎవరనే విషయాన్ని అరుణ్‌ కనిపెట్టాడా? అసలు ఆ హత్యలు చేసే వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? అనేదే మిగతా కథ.



నటీనటులు
ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌.. యాక్షన్‌ సీన్స్‌తోపాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. ఇంతకుముందు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించినా.. ఈ మూవీలో మాత్రం ఇంటెన్సిటీతో నటించాడు. ఇక టీచర్‌గా కృష్ణవేణి పాత్రలో అనుపమా.. లుక్స్‌తో బాగానే ఆకట్టుకుంది. కనిపించింది తక్కువే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు. రాక్షసుడు పాత్రను తెరపై చూస్తేనే ఆ థ్రిల్‌ను ఫీల్‌ అవ్వొచ్చు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ
సినిమాకు కథ ముఖ్యం. కథే సినిమాను నడిపించాలి. అలా ఓ కథ.. ఒక భాషలో విజయవంతం అయినా.. మిగతా భాషల్లో అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తుందా అంటే చెప్పలేం. అయితే హారర్‌, సైకో థ్రిల్లర్‌, క్రైమ్‌ ఇలాంటివాటికి భాషతో పని ఉండదు. ఇలాంటి వాటిని ఓ వార్గం వారు మాత్రమే ఇష్టపడతారు. అలా తమిళంలో హిట్‌ కొట్టిన రాక్షసన్‌ చిత్రాన్ని ‘రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకులకు అందించారు. రీమేక్‌ చేయడం కత్తి మీద సాములాంటింది. కొత్తవి చేరిస్తే.. పాడు చేశారు అంటారు. ఉన్నవి తీసేస్తే ఫీల్‌ మిస్‌ చేశారంటారు. అలా రీమేక్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాల్సి వస్తుంది.

రాక్షసుడు చిత్రానికి కూడా అలాంటి సమస్యే వచ్చింది. ఇలాంటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఎలాంటి రిపేర్‌ చేయకుండా యథాతథంగా తెరకెక్కించారు. అయినా సరే థ్రిల్లింగ్‌కు గురి చేసే ఎన్నో అంశాలు ఉండటం.. సీటు అంచున కూర్చోబెట్టే మూమెంట్స్‌ ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఫస్ట్‌ టైమ్‌ ఈ చిత్రాన్ని చూస్తున్నవారికి మాత్రమే అలాంటి థ్రిల్‌కు గురవుతారు. థ్రిల్లర్‌ మూవీతో వచ్చే చిక్కే అది.. ఓ సారి కథాకమామీషు తెలిశాక సినిమాను చూడలేం. తమిళ్‌లో ఓ మూవీ హిట్‌ అయింది.. బాగుంది అని తెలిశాక మనవాళ్లు చాలామంది చూసేస్తున్నారు. మరి అలా చూసిన వారిని ఈ సినిమా అంత ఆశ్చర్యానికి గురి చేయకపోవచ్చు. మాతృకను చూడని వారిని రాక్షసుడు మాత్రం కచ్చితంగా భయపెట్టిస్తాడు.. థ్రిల్‌కు గురిచేస్తాడు. ఇక గిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్‌ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
కథ, కథనం
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌
ఎంటర్‌టైన్మెంట్‌ లేకపోవడం
తమిళ వర్షన్‌ చూసినవారికి థ్రిల్లింగ్‌గా అనిపించకపోవడం

బండ కళ్యాణ్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement