
ఆ విషయంలో ఎవరేమనుకున్నా డోంట్‌కేర్ అని తెగేసిచెబుతోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. నటిగా తక్కువ కాలంలోనే చాలా డబ్బు సంపాదించేసుకుంది. నటిగానే కాకుండా సొంతంగా జిమ్‌ల నిర్వహణ, వాణిజ్య ప్రకటనలు, షాపుల ప్రారంభోత్సవాలు అంటూ వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఎడాపెడా చేసేసి డబ్బు కూడపెట్టేస్తోంది. దీంతోనే అర్థం అవడంలా? ఈ అమ్మడు పక్కా కమర్శియల్ అని. తెలుగులో ఆ మధ్య క్రేజీ హీరోయిన్‌గా రాణించినా, ఇప్పుడు తగ్గిపోయింది. వరుస ఫ్లాప్‌లే అందుకు కారణం.
ఇక కోలీవుడ్‌లో సక్సెస్ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ఆదిలో అవకాశాల కోసం పడిగాపులు కాసిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కోలీవుడ్ అసలు పట్టించుకోలేదు. తెలుగులో పేరు తెచ్చుకోవడంతో తమిళసినిమా ఆమెపై దృష్టి మరల్చింది. అయితే ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం మినహా ఇక్కడ సక్సెస్‌లు అందుకోలేకపోయింది. అలాంటిది తాజాగా మరో జాక్‌పాట్ కొట్టేసింది. అదే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్‌తో జతకట్టే అవకాశం.అయితే ఈ సినిమాలో నటి కాజల్‌అగర్వాల్ కూడా నటిస్తోంది.
రకుల్‌ప్రీత్‌సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే నా హద్దు. ఇంత వరకే నేను చేయగలను అన్న నిర్ణయానికి రావడం నాకు నచ్చదు. నిత్యం కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలని కోరుకుంటాను. నిన్నలానే నేడూ జరిగితే అందులో విశేషం ఏముంటుంది. ప్రతి నిత్యం కొత్తగా ఏదో ఒకటి చేస్తాను. అదే సినిమాలో నన్ను ఇంత కాలం కొనసాగేలా చేసింది. ఆరోగ్యానికి, వ్యాయామానికి ప్రాముఖ్యతనిస్తాను. నేను భోజనప్రియురాలిని. ఎంత తింటానో, అంతగా కసరత్తులు చేస్తాను.
ఇకపోతే పారితోషికం విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని చాలా మంది చెప్పుకుంటున్నారు. నాకిచ్చిన పాత్ర కోసం ఎంతగా శ్రమించాలో అంతగా శ్రమించడానికి రెడీ, ఇక పారితోషికం విషయానికి వస్తే ఎంత ఇవ్వగలరన్నది ముందుగానే చెప్పాలి. అంగీకరించిన పారితోషికాన్ని చెల్లించకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. అది నాకు నచ్చదు. పారితోషికం విషయంలో రకుల్‌ప్రీత్‌సింగ్ ఖరాఖండీగా ఉంటుంది అని చేసే విమర్శలను కేర్ చేయను అంటోంది ఈ బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment