రకుల్ ప్రీత్‌సింగ్
రకుల్ ప్రీత్‌సింగ్ ఇంటి డోర్‌ని ఈ మధ్య తట్టిన అవకాశాలన్నీ బాలీవుడ్, కోలీవుడ్ నుంచే వచ్చినట్టున్నాయి. అందుకే ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో పాత్ర తప్ప ఆమె చేస్తున్న మిగతావన్నీ హిందీ, తమిళ సినిమాలే. ‘వెంకీమామ’ సినిమా కమిట్ అయ్యారనే వార్త ఉంది. ఇప్పటికే హిందీ చిత్రం ‘దేదే ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసిన రకుల్ తాజాగా మరో హిందీ సినిమా కూడా ఓకే చేశారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో ‘మర్జావా’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారామె. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటిస్తారు. తారా సుతారియా మరో హీరోయిన్. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్‌గా రకుల్ కనిపిస్తారట.
ఈ సినిమాలో తన పాత్ర గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మిలాప్ నాకీ స్క్రిప్ట్ వినిపించగానే నచ్చింది.నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా చేయాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి పాత్ర అది. అలాగే నా పాత్రకు మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇందులో కొత్తగా కనిపిస్తాను. సిద్ధార్థ్‌తో ‘అయ్యారే’ తర్వాత మళ్లీ యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక అజయ్ దేవగన్, రకుల్, టబు తదితరులు నటించిన ‘దేదే ప్యార్ దే’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో సూర్యతో ‘ఎన్‌జీకే’, కార్తీ సరసన ‘దేవ్’ చిత్రాలతో పాటు శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు రకుల్.
Comments
Please login to add a commentAdd a comment