
రేపటికి సరిగ్గా పదేళ్లు... ‘చిరుత’తో రామ్‌చరణ్ హీరోగా పరిచయమై! ఈ పదేళ్లలో తొలి సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో గానీ, నిర్మాత సి. అశ్వనీదత్‌తో గానీ చరణ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఒక్కోసారి అంతే! కాంబినేషన్ సెట్ కావడానికి ఎందుకో లేటవుతుంటుంది! ఈసారి అశ్వనీదత్, చరణ్, పూరీలు లేట్ చేయకుండా కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. రీసెంట్‌గా రామ్‌చరణ్‌ను కలసిన పూరి ఓ కథను వినిపించారట.
చరణ్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ చిరుత కాంబినేషన్ సినిమా పట్టాలు ఎక్కుతుంది. వైజయంతి మూవీస్ పతకాంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం’ చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తారు. ప్రస్తుతం తనయుడు ఆకాశ్ హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ మూడు సినిమాలు పూరై్తన తర్వాత చరణ్, పూరిల సినిమా ప్రారంభమవుతుందట!!