కత్తి లాంటి తని ఒరువన్ | Ram Charan, Chiranjeevi remake for tamil movies | Sakshi
Sakshi News home page

కత్తి లాంటి తని ఒరువన్

Published Fri, May 20 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

కత్తి లాంటి తని ఒరువన్

కత్తి లాంటి తని ఒరువన్

రాయిలో అవసరం లేనిది చెక్కేస్తే... విగ్రహం కనపడుతుంది. అలా అని ప్రతి రాయిలో విగ్రహం ఉందనుకోవడం మూర్ఖత్వమే!  విగ్రహం... చెక్కినవాడి ఉలిలో ఉంటుంది. వాడి కళ్ళల్లో ఉంటుంది. సినిమా మేకింగూ అంతే! వేరే దేశాల్లో, వేరే భాషల్లో అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమా విగ్రహాల్ని చెక్కుతూ ఉంటారు. మేకింగ్ కంటే రీమేకింగే చాలా కష్టమైన పని. ఉన్న విగ్రహంలా చెక్కకూడదు. ఉన్న విగ్రహంలోని ఆత్మను పోగొట్టుకోకూడదు. కానీ, విగ్రహం కొత్తగా అనిపించాలి. అమ్మో! చాలా పెద్ద పరీక్ష.

తమిళంలో విజయ్‌తో ‘కత్తి’, ‘జయం’ రవితో ‘తని ఒరువన్’ తీశారు. రెండూ పెద్ద హిట్. ఇప్పుడు ‘కత్తి’ని చిరంజీవితో, ‘తని ఒరువన్’ని రామ్‌చరణ్‌తో రీమేక్ చేస్తున్నారు. ఆ తమిళ కథలు అందరికీ తెలుసు. మరి, మీకు తెలుసా?


హైదరాబాద్ జూబ్లీహిల్స్... కొండ మీద వెలసిన ఆ కాలనీలో కొసకొమ్మున ఉన్న ఆ చివరి ఇంద్రభవనం నుంచి సిటీ వ్యూ ప్రతిరోజూ ఒక కొత్త అనుభవమే. ఆ ఇంట్లో ఇప్పుడు రోజూ జరుగుతున్న సినీచర్చలు పూర్తిగా ‘మెగా’ హడావిడి, హంగామాను తలపిస్తున్నాయి. ఇంటి పెద్ద, ఆ పెద్దకు వారసుడు - ఇద్దరూ ఇప్పుడు తమ కొత్త సినిమాల బిజీలో ఉన్నారు.
 
చిత్రం ఏమిటంటే - ఇద్దరు చేస్తున్నవీ రీమేక్‌లే! తమిళంలో నుంచి తెలుగు లోకి దిగుమతి చేసుకుంటున్న కథలే! తండ్రి - మెగాహీరో చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ (2007 జూలై 27న రిలీజ్) తరువాత 9 ఏళ్ళ గ్యాప్‌తో మళ్ళీ పూర్తిస్థాయి హీరోగా తెర ముందుకు వస్తున్నారు. ఈ మధ్యలో ఆయన తెరపై కనిపించిన ‘మగధీర’, గడచిన దసరాకు వచ్చిన ‘బ్రూస్‌లీ’- రెండిటిలోనూ అతిథి పాత్రలే చేశారు. తాజాగా, ఏణ్ణర్ధం క్రితం నాటి తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘కత్తి’ రీమేక్‌తో తన 150వ సినిమా మైలురాయిని దాటేందుకు సిద్ధమవు తున్నారు.

కాగా, ‘బ్రూస్‌లీ’ ఆశించిన విజయం సాధించకపోవడంతో కాస్తంత విరామం తీసుకొని, మళ్ళీ విజృంభించడానికి సిద్ధమవుతున్న మెగా వారసుడు రామ్‌చరణ్ కూడా రీమేక్ అనే సేఫ్ గేమ్‌ను ఆశ్రయించారు. గత ఏడాది తమిళ సూపర్‌హిట్స్‌లో ఒకటైన ‘తని ఒరువన్’ రీమేక్‌లో తెలివైన పోలీసాఫీసర్‌గా రామ్‌చరణ్ నటిస్తున్నారు. తండ్రీ కొడుకులిద్దరూ ఇలా తమిళ రీమేక్‌ల బాట పట్టడం ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’ అయింది. ఇంతకీ ఇద్దరు పెద్ద హీరోలను ఆకర్షించిన ఆ రీమేక్ కథలు ఏమిటి? వాటి తెర వెనుక కథేమిటి అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.
 
చిరంజీవికి ‘కత్తి’ లాంటి కథ!
సినిమాలకు సంబంధించినంత వరకు మనకు సంక్రాంతి తరువాత దసరా పెద్ద పండుగైతే తమిళనాట మాత్రం దీపావళి పెద్ద పండుగ. అన్ని వర్గాలూ ఆనందోత్సాహాలతో ఉండే ఆ సమయంలో పత్రికలు, మ్యాగజైన్లు భారీ స్థాయిలో ప్రత్యేక సంచికలు రిలీజ్ చేస్తాయి. ఒకటికి నాలుగు పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు వచ్చే సీజన్ అది. సరిగ్గా అలాంటి దీపావళి సీజన్‌కి 2014 అక్టోబర్ 22న హీరో విజయ్ ‘కత్తి’ విడుదలైంది. ఆయన ద్విపాత్రాభి నయం చేసిన ఈ సినిమాకు సమంత హీరోయిన్. మురుగదాస్ దర్శకుడు.
 
‘కత్తి’ కథను సమకాలీన సమాజంపై మురుగదాస్ వ్యాఖ్యానం అనుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే కదిరేశన్, జీవానందం - అనే రెండు పాత్రలు కీలకం. రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ కత్తిగా రెండు పాత్రలూ హీరో విజయ్ పోషించారు. గూండాల బారినపడి, బుల్లెట్ గాయమైన జీవానందాన్ని ‘కత్తి’ చూస్తాడు. తనలానే ఉన్న అతని కథ, చేస్తున్న ఉద్యమం తెలుసుకొని, అతని స్థానంలోకి తాను వెళ్ళి, రైతుల పక్షాన పోరాటం చేస్తాడు. కేవలం కొన్ని పదుల కోట్లతో తయారైన ఈ తమిళ సినిమా రూ. 100 కోట్ల పైగా వసూలు చేసి, 2014లో తమిళనాట హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం! దీన్నే చిరంజీవి తన రీ-ఎంట్రీ సినిమాగా ఇప్పుడు ఎంచుకున్నారు.
 
రామ్‌చరణ్ ‘తని ఒరువన్’ ఏంటి?  
రామ్‌చరణ్ హీరోగా నిర్మాత అల్లు అరవింద్, తిరుపతికి చెందిన డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ ఎన్.వి. ప్రసాద్‌తో కలసి నిర్మిస్తున్న రీమేక్‌కు ఒరిజినల్ ‘తన్ని ఒరువన్’ కూడా తమిళనాట బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసిన కథే! కేవలం 20 కోట్ల ఖర్చుతో తయారైన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ టేకింగ్‌తో అందరినీ పడేసింది. ఈ సినిమా కథేమిటంటే... నగరంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రొబేషన్‌లో ఉన్న ఐ.పి.ఎస్. ఆఫీసర్ అయిన హీరో, అతని మిత్ర బృందం రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నిస్తారు.

తీరా తాము ప్రాణాల్ని పణంగా పెట్టి పట్టుకొన్న నేరస్థులు కాస్తా వ్యవస్థలోని లోపాల కారణంగా శిక్ష లేకుండా బయటపడడం వారికి బాధ కలిగిస్తుంది. హీరో రహస్యంగా దర్యాప్తు చేసి, నగరంలోని చిన్న నేరాలన్నీ ఒక భారీ కుట్రకు మూలమని గ్రహిస్తాడు. ఆ భారీ కుట్ర వెనుక ఉన్న అసలు నేరస్థుణ్ణి కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. సమాజంలోని పేరున్న వాడూ, ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత అయిన ఓ సైంటిస్ట్ ఔషధాల రంగంలోని అతి పెద్ద కుట్రకు సూత్రధారి అని హీరో కనిపెడతాడు. రియల్ ఎస్టేట్, ఖనిజాల మాఫియాలో కూడా హస్తం ఉన్న ఆ తెలివైన సైంటిస్ట్ విలన్‌కూ, ఈ పోలీసా ఫీసర్ హీరోకూ మధ్య జరిగే ఎత్తులు పెయైత్తుల చదరంగమే మిగతా కథ.
 
స్టైలిష్... మెగా మేకింగ్  
మణిరత్నం ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాలతో చిరపరిచితుడైన అరవింద్ స్వామి విలన్‌గా తమిళంలో చేసిన ఈ తొలి భారీ ప్రయత్నం కొత్తగా అనిపిం చింది. అందుకే ఇప్పుడీ తెలుగు రీమేక్‌లోనూ ఆయననే విలన్‌గా ఎంచుకున్నారు. ఇక ‘జయం’ రవి చేసిన సిన్సియర్ యువ ఐ.పి.ఎస్. ఆఫీసర్ పాత్రపోషణ కోసం తెలుగులో రామ్ చరణ్ కూడా యమా సిన్సియర్‌గా కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఊహలకు అనుగుణంగా పాత్రకు తగ్గట్లు పూర్తిగా కొత్త లుక్‌తో, మేకోవర్‌కు చరణ్ సిద్ధమ య్యారని కృష్ణానగర్ వార్త.

ఇప్పటికే బ్యాంకాక్‌లో అరవింద్ స్వామితో కొన్ని సీన్లు చిత్రీకరించారు. హైదరాబాద్‌లో, ఆ తరువాత కాశ్మీర్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధం అవుతున్నారు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు స్టైలిష్ మేకింగ్ కీలకం కాబట్టి దర్శక - నిర్మాతలు దాని పైన దృష్టి పెడుతున్నారు. తమి ళంలో దర్శకుడు ఎం. రాజా కథకు, డిటెక్టివ్ నవలా రచయితల ద్వయం ‘శుభ’ (జంట రచయితలు డి.సురేశ్, ఎ.ఎన్. బాలకృష్ణన్‌లకు ఇది కలం పేరు)లతో కలసి చేసిన రచన అక్కడి ప్రేక్షకులకు వినూత్న అనుభవమైంది. ఆ అనుభవా న్ని తెలుగులోనూ పునః సృష్టిం చేందుకు దర్శక, రచయితలు ప్రయత్నిస్తున్నారు.
 
తండ్రి హీరో... కొడుకు నిర్మాత!
మరోపక్క వారసుడికి దీటుగా, మళ్ళీ మునుపటిలా ఆటపాటలతో, ఫైట్లతో అలరించడానికి చిరంజీవి కూడా శారీరకంగా కసరత్తులు మొదలెట్టారు. తెరపై ద్విపాత్రాభినయానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ ఒకప్పటి చార్మ్‌తో ‘కత్తిలాంటోడు’ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ‘బ్రూస్‌లీ’ చిత్రంలో అతిథి పాత్రతో లెక్కప్రకారం 150 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు హీరోగా పూర్తిస్థాయి సినిమాతో ఆ మైలురాయిని దాటనున్నారు. విశేషం ఏమిటంటే, సాక్షాత్తూ చిరంజీవి సతీమణి కె.సురేఖ, కుమారుడైన యువ హీరో రామ్‌చరణ్ నిర్మాతలుగా ‘కొణిదెల ప్రొడ క్షన్ కంపెనీ’ పతాకం స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించడం. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్’ సినిమాతో ముడిపడిన మధు, తమిళ ‘కత్తి’ ఒరిజనల్ నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ ఈ రీమేక్‌లో పాలు పంచుకుంటున్నారు!
 
అయితే, ‘కత్తి’ తమిళ సినిమా కథ నిజానికి తనదేనంటూ తెలుగు దర్శ కుడు ఎన్. నరసింహారావు ఇప్పటికే సాక్ష్యాధారాలతో సహా గగ్గోలు పెట్టారు. తమిళ దర్శక, నిర్మాతలతో ఆయనకున్న ఆ వివాదానికి ప్రస్తుతానికి కామా పెట్టి, రీమేక్ షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ‘ఠాగూర్’ తీసిన మాస్ దర్శకుడు వి.వి. వినాయక్‌కే ఈ ‘కత్తి లాంటోడు’ దర్శకత్వాన్నీ అప్పగించారు.

సీనియర్ సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో కలసి హీరో, దర్శక- నిర్మాతలు తమిళ మాతృకలో తెలుగుకు తగ్గట్లు చాలానే మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. వేసవి అయిపోయాక, అభిమానుల హంగామా మధ్య జూలైలో రెగ్యులర్ షూటింగ్‌కు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. గతంలో ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క ఈసారి ఆయన పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. జూలై కల్లా ‘బాహుబలి2’ షూటింగ్ పని పూర్తి చేసుకొని ఆమె కూడా వచ్చి షూటింగ్‌లో చేరతారని సమాచారం.
 
మొత్తం మీద మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకుల నుంచి వస్తున్న ఈ రెండు ‘మెగా’ రీమేక్‌లే. సెట్స్‌పైకొస్తూనే రెండూ సంచలనమయ్యాయి. మరి బాక్సా ఫీస్ వద్ద చెరో వంద కోట్ల పైన వసూలు చేసిన తమిళ ‘కత్తి’, ‘తని ఒరువన్’ కథలు ఇప్పుడు తెలుగు రీమేక్స్‌గానూ ఆ రేంజ్ వసూళ్ళు సాధిస్తాయా? మెగా హీరోలకే కాదు, పరిశ్రమకు కూడా ఆ స్థాయి హిట్లే ఆకాంక్ష, అవసరం కూడా!
- రెంటాల జయదేవ
 
కలిసొచ్చిన కాంబినేషన్
‘గజని’, తెలుగు ‘స్టాలిన్’ చిత్రాల ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ తమిళ ‘కత్తి’ చిత్ర దర్శకుడు. నిజానికి మురుగదాస్ ప్రమేయమున్న కథలతో చిరంజీవి తెరపైకి రావడం  ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో చిరంజీవి రాజకీయ తెరంగేట్రానికి మెట్లుగా పనికొచ్చిన ‘ఠాగూర్’ (2003 - విజయకాంత్ నటించిన తమిళ సూపర్‌హిట్ ‘రమణ’కు రీమేక్), ‘స్టాలిన్’ (2006) చిత్రాలు కూడా మురుగదాస్ అందించిన కథలే! ఇప్పుడీ ‘కత్తి’ ముచ్చటగా మూడోది. ఈ మూడు సినిమాల కథలూ సమకాలీన సమాజంలోని అంశాలను ఎత్తిచూపేవే కావడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. హీరోగా మళ్ళీ తెర ముందుకు వచ్చేందుకు రకరకాల స్క్రిప్ట్‌లు విన్న చిరంజీవి ఏదీ సంతృప్తినివ్వకపోయేసరికి అటు సామాజిక స్పృహ, ఇటు హీరోయిజమ్ - రెండూ కలిసొచ్చే ఈ ‘కత్తి’ రీమేక్‌కు ఓటేశారు.
 
డబ్బింగ్... అయిపోయింది! రీమేక్... అవుతోంది!
నిజానికి, విజయ్ ‘కత్తి’ సినిమాను అదే పేరుతో మొదట తెలుగులో డబ్బింగ్ చేయాలనుకున్నారు. ‘ఠాగూర్’ చిత్ర నిర్మాణంతో ‘ఠాగూర్’ మధుగా పేరు తెచ్చుకున్న నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ బి. మధు తమిళ ‘కత్తి’ రైట్స్ కొన్నారు. డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అనుకుంటున్న టైమ్‌లో, తమిళంలో సూపర్‌హిట్టయిన ఈ సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, చిన్న ఎన్టీయార్ - ఇలా పలువురు హీరోల పేర్లూ ఆ రీమేక్‌కు వినిపించాయి. వారు తమిళ ఒరిజినల్ చూడడమూ జరిగింది. చిన్న ఎన్టీయార్‌తో రీమేక్ దాదాపు ఖాయమనే దాకా కథ వచ్చింది. కానీ ఈ స్క్రిప్ట్ వైపు చిరంజీవి మొగ్గారు. సామాజిక స్పృహ ఉన్న ఈ కథ - జోరు తగ్గిన తన పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మళ్ళీ ఊపు తెస్తుందనీ, సినిమాల్లో రీ-ఎంట్రీకి పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ అనీ చిరు భావన. ‘కత్తి’ సినిమాలో తమిళంలో విజయ్ కెరీర్‌కు వచ్చిన హుషారు చూస్తే, చిరంజీవిది సరైన నిర్ణయమేనేమో!
 
రీమేక్‌ల మీద మోజెందుకు?
పదుల కోట్ల రూపాయలను పణంగా పెట్టే సినీ పరిశ్రమలో - ఒక భాషలో హిట్టయిన కథను తీసుకొని, పునర్నిర్మిం చడం వ్యాపారపరంగా చూస్తే ఉన్నంతలో సేఫ్ బెట్! అందుకే సహజంగానే ప్రతి శుక్రవారం తమిళ, మలయాళ సీమల్లో విడుదలయ్యే చిత్రాల వివరాల కోసం మన హీరోలు, నిర్మాతలు ఆసక్తిగా చూస్తుంటారు. చెన్నై కోడం బాకమ్ టాక్ కోసం మన కృష్ణానగర్ నుంచి చకచకా ఫోన్‌లు చేస్తుంటారు. ఇక, శుక్రవారం ఉదయం చెన్నైలో ఫ్లైట్ దిగి, సినిమా చూసి, సాయంత్రానికి హైదరాబాద్ వచ్చే దర్శక, నిర్మాతలూ చాలామందే! తాజాగా మల యాళ, మరాఠీ హిట్‌ల రీమేక్‌కూ మంచి క్రేజ్ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement