గోవిందుడు అందరి వాడేలే?
ఇప్పటివరకూ మాస్ మసాలా కథలతో చెలరేగిపోయిన చరణ్... తన పంథాకి కామా పెట్టి, కాస్తంత కూల్‌గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా చల్లని పైరగాలి లాంటిదేనని సమాచారం. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే అందమైన కుటుంబకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట కృష్ణవంశీ. అందుకే... కథకు తగ్గట్టుగా ఈ సినిమాకు ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. అచ్చమైన తెలుగుదనం మొత్తం ఈ పేరులో ఉంది కదూ.
దీన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకొచ్చేయొచ్చు. కుటుంబాల్లోని ఆప్యాయతల్ని, అనురాగాల్ని తెరకెక్కించడంలో కృష్ణవంశీ దిట్ట. మురారి, చందమామ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఆ స్థాయిలోనే ఈ సినిమా కూడా ఉంటుందని వినికిడి. మూడు తరాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. సీనియర్ తమిళ నటుడు రాజ్‌కిరణ్ ఇందులో చరణ్‌కి తాతగా నటిస్తుండగా, బాబాయ్‌గా శ్రీకాంత్ కనిపిస్తారు. చరణ్ కెరీర్‌లోనే గుర్తుండిపోయే సినిమాగా ఈ మల్టీస్టారర్‌ని నిర్మించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. కళాకారుల్లో ప్రతిభను రాబట్టుకోవడంలో కృష్ణవంశీ సిద్ధహస్తుడు. మరి ఈ సినిమా ద్వారా చరణ్‌ని నటుడిగా ఆయన ఏ స్థాయిలో చూపిస్తారో చూడాలి.