
హిందీలో ‘గవర్నమెంట్’
మాఫియా సినిమాలు తీయడంలో రామ్‌గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ‘సత్య, కంపెనీ, సర్కార్’ తదితర చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు మళ్లీ మాఫియా నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ‘గవర్నమెంట్’ పేరుతో ఓ సినిమా రూపొందించనున్నారు. ఇది హిందీ చిత్రం. మాఫియా డాన్‌లు దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్‌ల మధ్య నెలకొన్న మనస్పర్థలు, వాళ్లిద్దరూ విడిపోయాక పుట్టగొడుగుల్లా వచ్చిన ఛోటా ఛోటా డాన్‌లు, హఠాత్తుగా అబూ సలేమ్ డాన్‌గా ఎదగడం వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుంది.
ఈ మూడు పాత్రలతో పాటు ఇంకా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, శివసేన అధినేత దివంగత బాల్ థాకరే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, నటి మోనికా బేడి, ఛోటా రాజన్ సతీమణి సుజాత... ఇలా పలువురి జీవితాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. దావూద్ ఇబ్రహీమ్-ఛోటా రాజన్‌ల జీవితం ఆధారంగా ‘కంపెనీ’ తీసినప్పటికీ అది కాల్పనిక కథ అనీ, ‘గవర్న మెంట్’ సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. ‘సర్కార్ 3’కీ, దీనికీ కూడా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.