
నేను మారువేషంలోని పోలీసును: వర్మ
చాలారోజులకు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నాడు. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఆయనకు 'వీరప్పన్' సినిమా విజయంతోపాటు ప్రశంసలను తెచ్చిపెడుతున్నది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో వర్మ ఓ విషయాన్ని అంగీకరించాడు. అదేమిటంటే తాను మారువేషంలో ఉన్న పోలీసు అట.
బాగా స్టడీ చేసి 'వీరప్పన్' సినిమా తీయడం వల్ల కాబోలు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'నేనొక విషయాన్ని ఒప్పుకోవాలి. నిజానికి నేను దర్శకుడి వేషంలో ఉన్న పోలీసును' అంటూ వర్మ తాజాగా ట్వీట్ చేశారు. నిత్యం ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తూ.. వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ తాజాగా మాత్రం ఈ ట్విస్టుతో అభిమానుల దృష్టి ఆకర్షించాడు. అంతేకాకుండా పోలీసు వేషంలో తానున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశాడు.