ఎన్టీఆర్ జీవితంలోని కాంట్రవర్సీలు చూపిస్తా..!
నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటన దగ్గర నుంచే వివాదాలకు కేంద్ర బిందువైన ఈ వార్త ఇప్పుడు మరి ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పదవిని కోల్పోవటం, ఆయన మరణం లాంటి అంశాలను సినిమాలో ప్రస్తావించకూడదని కొందరు, ఆయన మరణానికి అసలు కారణాలను చూపించాలని మరికొందరు డిమాండ్ చేశారు.
ఇన్ని వివాదాలు ఉన్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్న ప్రశ్న మొదలైంది. అయితే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను బాలకృష్ణ, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పగించారు. ఇప్పటికే రక్తచరిత్ర, వీరప్పన్, వంగవీటి లాంటి సినిమాలను తెరకెక్కించిన వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ప్రకటించాడు.
'తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు నాకు ఆయనతో పర్సనల్ గా వున్న అనుబంధం ఏమిటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10 కిమీ దూరం కాలి నడకన వెళ్లేవాడిని.
అంతే కాకుండా NTR తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేనూ వున్నాను .. అలాంటి అతి మామూలు నేను... ఇప్పుడు NTR జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి NTR బయోపిక్ లో ఆయన శత్రువులెవరో ,నమ్మక ద్రోహులెవరో,ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా NTR చిత్రం లో చూపిస్తాను. ' అంటూ వర్మ స్వయంగా ఆడియో సందేశాన్ని పంపించారు.
ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ బయోపిక్ను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న బాలయ్య, ఆ తరువాత కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది.