
నయీమ్ జీవితంతో మూడు సినిమాలు!
ఎప్పుడూ ఓ నాలుగు కళ్లు నేరాలు-ఘోరాలు, మాఫియా కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయా? అని వెతుకుతుంటాయి. అందులో పోలీసులవి రెండు కళ్లు అయితే.. ఇంకో రెండు కళ్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మవి. మాఫియా, ఇతర నేరాలను అరికట్టాలని పోలీసులు ఓ కన్నేస్తే, సదరు గ్యాంగ్‌స్టర్‌లపై సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వర్మ ఉంటారు. నిజజీవిత ఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో వర్మ స్పెషలిస్ట్.
హిందీలో ‘సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం వర్మ కన్ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ మీద పడింది. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన నయీమ్ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తానని వర్మ ట్వీటారు. ‘‘నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్‌గా, ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఆల్ టైమ్ క్రిమినల్ నంబర్‌వన్ నయీమ్ నేరచరిత్రకు సంబంధించిన పలు కథనాలు తెలుసుకున్నాను. అతడు చేసిన పనులు భయంకరమైనవి.
ఒక్క సినిమాలో నయీమ్ కథ అంతటినీ చెప్పడం అసాధ్యం. అందుకే, మూడు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని వర్మ పేర్కొన్నారు. నయీమ్ మరణించిన తర్వాత ప్రతి రోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో రాబోయే నయీమ్ ట్రయాలజీ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో!