
ప్రత్యక్ష దైవం
ఇప్పటి వరకూ షిరిడీ సాయి జీవితం ఆధారంగా పలు చిత్రాలొచ్చాయి. తాజాగా మచ్చ రామలింగారెడ్డి సాయిబాబా పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. విజేత, శ్రీకృష్ణ జంటగా కొండవీటి సత్యం దర్శకత్వంలో దత్త ఫిలింస్ పతాకంపై సుకుమార్, కోసూరి సుబ్బారావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకూ షిరిడీ సాయిబాబా చరిత్రపై వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా మా చిత్రం ఉంటుంది.
అనంతపురం, పెన్నా, అహోబిలం ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం. కిషన్ కవాడియా మంచి పాటలు అందించారు. ఆడియో విడుదలైన తర్వాత ప్రతి ఇంట్లో ఈ చిత్రంలోని పాటలు మార్మోగుతాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంతో భక్తిరస చిత్ర దర్శకునిగా సత్యంకు మంచి పేరొస్తుంది. అందర్నీ అలరించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం’’ అని తెలిపారు. సతీష్, రేఖారాణి, కాటంరెడ్డి, రజనీ, శశికళ, ప్రశాంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సూర్య.