
నాన్నే నిర్మాత
రామానాయుడుగారి సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ వందకు పైగా చిత్రాలు నిర్మించింది. తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోలందరూ దాదాపుగా ఈ సంస్థలో నటించారు. కానీ, రామానాయుడి మనవడు, హీరో రానా మాత్రం ఇప్పటివరకూ సురేశ్ ప్రొడక్షన్స్‌లో నటించలేదు. నటుడైన ఆరేళ్లకు సొంత ప్రొడక్షన్ హౌస్‌లో నటించే అవకాశం రానాకు దక్కింది. రానా, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు.
సోమవారం తమిళనాడులోని కారైకుడిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. రానా తమ్ముడు అభిరామ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ‘‘ఈ నిర్మాతతో తొలిసారి పనిచేస్తున్నా. ఆయనెవరో కాదు నాన్నే. మేం కలిసి పనిచేయడం అదృష్టం. త్వరలో పూర్తి వివరాలు చెబుతా’’ అంటూ తండ్రితో కలిసి తీసుకున్న సెల్ఫీని రానా ట్వీట్ చేశారు.