
ఆ కహానీకి కాజలే కరెక్ట్!
ఓ సినిమా విజయం సాధిస్తే ఆ ఘనత ఎక్కువ శాతం కథానాయకులకే దక్కుతుంది. మెరుపు తీగలా కనిపించి, కనువిందు చేసే కథానాయికల గురించి పెద్దగా మాట్లాడుకోరు. ఎందుకంటే, పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే వారి పాత్రలు పరిమితమవుతాయి కాబట్టి. అదే హీరోకి దీటుగా ఉండే పాత్రను హీరోయిన్ కూడా చేస్తే, అప్పుడు పేరొస్తుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు నలభై చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ హీరో పాత్రకు సమానంగా ఉండే పాత్రలు ఓ నాలుగైదు చేసి ఉంటారేమో. ఇప్పుడు హిందీలో ఆ తరహా పాత్ర దక్కించుకున్నారు. సింగమ్, స్పెషల్ 26 చిత్రాల ద్వారా హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కాజల్.
ప్రస్తుతం ఆమె చేయనున్న చిత్రం పేరు ‘దో లఫ్జోన్ కీ కహానీ’. దీపక్ తిజోరీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా హీరో. ఇందులో ఆయన మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా చేయనున్నారు. కథానాయిక పాత్ర కూడా చాలా శక్తిమంతంగా ఉంటుందట. ఎంతోమంది నాయికలను అనుకున్నా, దీపక్ తిజోరీకి పెద్దగా సంతృప్తి అనిపించలేదట. చివరికి కాజల్ నటించిన కొన్ని దక్షిణాది చిత్రాలు చూసి, ఆమె అభినయానికి ముగ్ధుడై, కథానాయికగా తీసుకున్నారు. హీరోకి దీటైన పాత్ర కాబట్టి కాజల్ న్యాయం చేయగలుగుతారని దీపక్ పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కాజల్ అనుకుంటున్నారట.