సల్మాన్పై రేప్ బాధితురాలి పరువునష్టం దావా
సుల్తాన్ షూటింగ్ ముగిసిన తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉందంటూ వ్యాఖ్యలు చేసినందుకు సల్మాన్ ఖాన్పై ఓ యువతి పరువునష్టం దావా దాఖలుచేసింది. అలా మాట్లాడినందుకు రూ. 10 కోట్లు కట్టాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. హర్యానాలోని హిస్సార్కు చెందిన ఈ యువతిపై నాలుగేళ్ల క్రితం 10 మంది గూండాలు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దాంతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. 10 మందిలో నలుగురికి జీవితఖైదు శిక్ష పడింది. వాళ్లకు మరణశిక్ష వేయాలంటూ ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది.
సల్మాన్ వ్యాఖ్యలతో తన క్లయింటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైందని, దానికి అతడే బాధ‍్యుడని యువతి తరఫు న్యాయవాది తన నోటీసులో పేర్కొన్నారు. సల్మాన్ ప్రకటన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, అందువల్ల ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. అలాంటి ప్రముఖ వ్యక్తులు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించింది. తాను తన తండ్రితో సహా సర్వస్వం కోల్పోయానని, ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తనను మరింత గాయపరిచారని బాధితురాలు వాపోయింది.