
నో మోర్ గ్యాప్!
ప్రామిస్... అభిమానులకు, ప్రేక్షకులకూ రవితేజ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అదేంటి అంటే... ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానంటున్నారు. ‘బెంగాల్ టైగర్’ విడుదలైన 420 రోజుల తర్వాత ‘టచ్ చేసి చూడు’ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. తర్వాత కొన్ని రోజులకు ‘రాజా.. ది గ్రేట్’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఇన్నాళ్లు మీరు ఎక్కడికి వెళ్లారు? అని రవితేజను ప్రశ్నిస్తే... ‘‘ఎక్కడికీ వెళ్లలేదు. స్క్రిప్ట్స్ వింటుండేవాణ్ణి. దాంతోనే నా టైమంతా గడిచింది. ఇక నుంచి గ్యాప్ ఉండదు. వరుసగా సినిమాలు చేస్తా. ‘టచ్ చేసి చూడు’ చిత్రీకరణ మొదలైంది. ఏప్రిల్‌లో ‘రాజా.. ది గ్రేట్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ గ్యాప్‌లో ఎప్పుడైనా నెగిటివ్‌గా ఫీలయ్యా రా? అని రవితేజను అడిగితే... ‘‘నా బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్. పాజిటివ్‌గా ఆలోచిస్తా. పాజిటివ్‌గా ఉంటాను’’ అన్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించనున్న ‘రాజా.. ది గ్రేట్’కి అనిల్ రావిపూడి దర్శకుడు.