మామా అల్లుళ్ల సవాల్!
ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నాడు? అలాగే తమను వ్యతిరేకించినఅమ్మాయి తండ్రిని ఎలా ఆడుకున్నాడు? ఫైనల్‌గా తమ ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకెళ్లాడు? అనే కథాంశంతో తె రకెక్కిన చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా, రావు రమేశ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు.
బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. సాహిల్, జి.సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. రావు రమేశ్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సోమనాథ్ చటర్జీ. బెంగాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నటించాను. మా నాన్నగారు రావు గోపాలరావు, చిరంజీవిగారు మామా అల్లుళ్లగా నటించిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రం కూడా అంతే విజయం సాధిస్తుంది.
ఈ సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు చాలా బాగుందన్నారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో నాకు, అవికా గోర్‌కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ మంచి ప్రేమకథకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు’’ అని రాజ్ తరుణ్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్-దాశరథి శివేంద్ర.