రాజ్యాంగ విరుద్ధం
ముంబై : విద్య, ఉద్యోగాలలో ముస్లిమ్‌లకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడానికి తాము వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నవిస్ పునరుద్ఘాటించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. ఇక మరాఠాలకు రిజర్వేషన్ల కల్పనపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని, దానిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి ముందే అవగాహన ఉండాలని ఫడ్నవిస్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు.
ఇక్కడి వైబీ చవాన్ హాలులో శనివారం జరిగిన ‘యూత్ ఫర్ డ్రీమ్ మహారాష్ట్ర’ కార్యక్రమంలో ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.138 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (ఏపీఎంసీ) కుంభకోణంపై దర్యాప్తును ప్రభుత్వం నిలిపివేయడంపై ఫడ్నవిస్ మండిపడ్డారు. ఈ కుంభకోణంలో ఎన్సీపీకి చెందిన మంత్రి శశికాంత్ షిండేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే. ఎపీఎంసీ డెరైక్టర్‌గా ఉన్న షిండే వ్యాపారులకు రూ.138 కోట్ల మేర లబ్ధి చేకూర్చారని ఫడ్నవిస్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఏపీఎంసీ వాషి బోర్డులో చోటుచేసుకున్న అవకతవకలపై దర్యాప్తుకు వ్యవసాయ మార్కెటింగ్ విభాగం డెరైక్టర్ ఇచ్చిన ఆదేశాలను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శశికాంత్ షిండే రాజీ నామా చేయాలని ఫడ్నవిస్ డిమాండ్ చేశారు.
ఈ అంశాన్ని సరైన సమయంలో లేవనెత్తుతామని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన వై4డీ (యూత్ ఫర్ డెమొక్రసీ, యూత్ ఫర్ డెవలప్‌మెంట్) చేపట్టిన డ్రీమ్ మహారాష్ట్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించేందుకు ఈ యువజన సమూహం నిపుణులు, మేధావులు, విద్యావేత్తలు, పౌర సంఘాలు, వ్యాపార కమిటీల నుంచి ఆలోచనలను, పరిష్కారాలను సేకరిస్తుంది. కాంగ్రెస్-ఎన్సీపీల 15 ఏళ్ల పాలన అవమానకరమని ఫడ్నవిస్ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 30కి పైగా కుంభకోణాలు జరిగాయని, 25 శాతం మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వ్యవసాయ ఉత్పత్తి 50 శాతం తగ్గిపోయిందని చెప్పారు. శాంతిభద్రతలు లోపించాయని, మౌలికసదుపాయాల జాడే లేదని, పన్నుల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. విద్యుత్ టారిఫ్, పన్ను లు, నీటి చార్జీలు పెరిగిపోయాయని, 4.5 శాతం మంది ఉపాధి కోల్పోయారని ఫడ్నవిస్ ఆరోపిం చారు. రాష్ట్ర అభివృద్ధికి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందించేందుకు పౌరులు ముందుకురావాలని ఆయన కోరారు.