‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’ | Rishi Kapoor Neetu Singh Love Story Lead Life For 4 Decades Together | Sakshi
Sakshi News home page

‘నా ప్రేయసితో బ్రేకప్‌ అయినపుడు నీతూ సాయం చేసింది’

Apr 30 2020 3:06 PM | Updated on Apr 30 2020 3:29 PM

Rishi Kapoor Neetu Singh Love Story Lead Life For 4 Decades Together - Sakshi

రిషి బాగా ఏడిపించేవారు.. ఆయనను చూస్తే కోపం వచ్చేది: నీతూ కపూర్‌

‘‘నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఓరోజు గొడవపడ్డాను. అప్పుడు నా హృదయం ముక్కలైపోయింది. అయితే నేను మళ్లీ ఆమెను తిరిగి నా జీవితంలోకి తీసుకువచ్చేందుకు నీతూ సహాయం కోరాను. నా ప్రేయసికి ఉత్తరాలు రాయడంలో తను నాకెంతగానో సాయం చేసింది. జరీలా ఇన్సాన్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఇది జరిగింది. రోజులు గడిచే కొద్దీ నాకో విషయం అర్థమైంది. నీతూ మిస్సవుతున్నా అనిపించింది. యూరప్‌లో షూటింగ్ చేస్తున్నపుడు తనకు ఒక టెలిగ్రాం ఇచ్చాను. నేను తన గురించి ఆలోచిస్తున్నా అని చెప్పాను. అప్పుడు తను కశ్మీర్‌లో ఉంది‌’’ అంటూ బాలీవుడ్‌ చాకొలెట్‌ బాయ్‌ రిషి కపూర్‌ నీతూ సింగ్‌తో ప్రేమలో పడిన విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.(హిందీ తెరకు రొమాంటిక్ హీరో..)

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న నీతూ మాత్రం రిషి చెప్పినట్టు తమ ప్రయాణం సాఫీగా మొదలుకాలేదని... షూటింగ్‌ తొలినాళ్లలో రిషి తనను బాగా ఏడిపించారని చెప్పుకొచ్చారు. తన మేకప్‌, దుస్తులపై కామెంట్లు చేసేవారని.. దాంతో ఆయనపై కోపంగా ఉండేదాన్నని చెప్పారు. రిషి ఒక తుంటరి, ఆకతాయి అని.. అందరినీ ఇలాగే ఆటపట్టించేవారని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో తనకు తెలియకుండానే ఆయన ప్రేమలో పడిపోయానని.. సైన్‌ చేసిన చిత్రాల షూటింగ్‌ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపారు. బాలీవుడ్‌ జంటల్లో అన్యోన్యమైన జంటగా పేరొందారు నీతూ- రిషి కపూర్‌. (అదే రిషి క‌పూర్ చివ‌రి కోరిక‌..)

రఫూ చక్కర్‌, దో దూని చార్‌, అమర్‌ అక్బర్‌ ఆంటోని, దూస్రా ఆద్మీ, అంజానే మే. ధన్‌ దౌలత్‌, ఖేల్‌ ఖేల్‌ మే, జిందా దిల్‌, జరీలా ఇన్సాన్‌ వంటి అనేక సినిమాల్లో జోడీగా కనిపించిన వీరు 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమార్తె రిధిమా కపూర్‌ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఉన్నారు. ఇక 40 ఏళ్ల దాంపత్య జీవితంలో వారి మధ్య చిన్న చిన్న అలకలే తప్ప పెద్దగా గొడవపడిన సంఘటనలు లేవంటారు రిషీ- నీతూ సన్నిహితులు. వీరిరువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. లుకేమియాతో తాను ఆస్పత్రిలో చేరిన సమయంలో భార్య నీతూ తనలో ధైర్యం నింపిందని... తన కుటుంబం వల్లే కాన్సర్‌ను జయించగలిగే నమ్మకం వచ్చిందని రిషి అనేక మార్లు చెప్పారు. (లాక్‌డౌన్‌.. తండ్రి చివరిచూపుకు రిథిమాకు అనుమతి)

అదే విధంగా నీతూ సైతం ప్రతీ సందర్భంలోనూ భర్త వెంటే ఉండేవారు. కుటుంబం కోసం చాలా కాలం నటనకు దూరమైన నీతూ.. బేషరమ్‌, లవ్‌ ఆజ్‌ కల్‌ వంటి చిత్రాల్లో భర్తతో కలిసి తెరపై తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఆయన శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో నీతూ శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా న్యూయార్క్‌లో కాన్సర్‌ చికిత్స పొందిన రిషి కపూర్‌ కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గురువారం ముంబై ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు, అభిమానులు రిషీ కపూర్‌కు నివాళులు అర్పిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement