పురుషుడు పని ఎప్పుడు చేస్తాడు? యుక్త వయసు నుంచి. స్త్రీ కూడా ఆ వయసు నుంచే చేయాలి కదా..ప్రతిభ, సామర్థ్యం, చదువు, పని చేయాలనే ఆసక్తి ఉన్నా ఆమెకు అది అంత సులువుగా వీలవదు. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత, భర్త బాగోగులు...ఇవి ఒక కొలిక్కి వచ్చేసరికి ఆమెకు నలభైలో యాభైలో దాటిపోతాయి. ఇప్పుడిక ఏం చేస్తాంలే అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు పని చేద్దాం అని మరికొందరు అనుకుంటారు. 62 సంవత్సరాల నటి నీతూ సింగ్, 52 సంవత్సరాల లోదుస్తుల మోడల్ గీత ఇద్దరూ ఇటీవలే పని మొదలెట్టారు.‘ఏజ్ ఈజ్ నాట్ కేజ్’ అంటున్నారు వీరు.
‘నాకిప్పుడు పని చేయాలని ఉంది. నా పిల్లల సపోర్ట్ నాకు ఉన్నా ఒక ఒంటరితనం ఉంది. నన్ను నేను ఎంగేజ్ చేసుకోవాలని అనిపిస్తోంది. అందుకని నటించాలని ఉంది’ అన్నారు నీతూ సింగ్ కపూర్. 62 ఏళ్ల నీతూ సింగ్ గత రెండేళ్లుగా చాలా ఆటుపోట్లను చూశారు. భర్త రిషి కపూర్ కేన్సర్ బారిన పడటం, ఆ తర్వాత మరణించడం దాదాపు నలభై ఏళ్లుగా ఉన్న తోడు వీడిపోవడం ఆమెకు కూడదీసుకోవాల్సిన అవసరాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె కూడదీసుకుంది. ‘నన్ను నేను పరీక్షించుకోవడానికి అసలు నేను నలుగురి ముందు కాన్ఫిడెంట్‌గా ఉండగలనా లేదా చూసుకోవడానికి ఈ షోకు వచ్చాను’ అని రెండు రోజుల క్రితం ప్రసారం అయిన ‘ఇండియన్ ఐడెల్’ షోలో గెస్ట్‌గా పాల్గొన్నప్పుడు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మనసులోని మాటలు ఎన్నో చెప్పారు.
ఏడేళ్ల వయసులోనే వార్నింగ్
తెలుగులో హిట్ అయిన ‘లేత మనసులు’ హిందీ రీమేక్ ‘దో కలియా’తో బాలనటి గా స్టార్ అయ్యారు నీతూ సింగ్. ‘దో కలియాకు నేను ఆడిషన్స్‌కు వెళితే కృష్ణన్–పంజు (ఆ సినిమా దర్శక ద్వయం) గార్లు బనియన్లు కనిపించేలా చొక్కా బటన్లు తీసి కాళ్లు కుర్చీల పైన పెట్టి ఆడిషన్స్ తీసుకుంటున్నారు. నాకు ఏడేళ్లు. ముందు షర్టు బటన్లు పెట్టుకుని కాళ్లు కిందకు దించితే ఆడిషన్ ఇస్తానని చెప్పాను. వాళ్లు ఆ ఒక్క మాటకు దిమ్మెరపోయి నాకు వెంటనే సినిమా ఆఫర్ ఇచ్చారు’ అని నీతూ సింగ్ చెప్పారు.
సినిమాలు... పెళ్లి.. పిల్లలు
రిషి కపూర్ నటించిన ‘బాబీ’ సూపర్ హిట్ అయ్యాక అది రిలీజయ్యేలోపే డింపుల్ కపాడియా పెళ్లి చేసుకోవడంతో రిషి కపూర్‌కు హీరోయిన్‌గా కొత్త అమ్మాయి కావాల్సి వచ్చింది. దాంతో 14 ఏళ్లే ఉన్నా నీతూ సింగ్ ‘ఖేల్ ఖేల్ మే’లో హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా హిట్ కావడంతో 22 ఏళ్లు వచ్చేసరికి దాదాపు 60-డెబ్బై సినిమాలు చేసి స్టార్ అయ్యింది. కాని రిషి కపూర్ పెళ్లి ప్రస్తావన తేవడంతో అతనితో ప్రేమలో ఉన్న నీతూ మొత్తం తన కెరీర్‌ను పక్కన పెట్టి, అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి వివాహం చేసుకుంది.
ఆ తర్వాత ఆమె నటన వైపు చూడనే లేదు.. ఎందరో అభిమానులు ఉన్నా. కూతురు రిథమ, కొడుకు రణ్‌బీర్ వీళ్ల పెంపకం, రిషి కపూర్ అబ్సెసివ్ బిహేవియర్ వల్ల అతన్ని అనుక్షణం కనిపెట్టుకోవాల్సి ఉండటం... వీటిలో పడి ఆమె తానొక నటి అన్న సంగతే మర్చిపోయారు. చాలా ఏళ్ల తర్వాత 2010లో భర్తతో కలిసి ‘దూ దూని చార్’ వంటి ఒకటి రెండు సినిమాల్లో నటించినా నటనకు ఆమెకు సమయం చిక్కలేదు.
ఇప్పుడు పని చేయాలని ఉంది
2020 ఏప్రిల్‌లో రిషి కపూర్ మరణించాడు. దాదాపు సంవత్సరం ఆమె తనలో తాను తన కుటుంబంతో తాను ఉండిపోయింది. ‘ఇప్పుడు నాకు పని చేయాలని ఉంది. నేను పని చేస్తాను’ అని ఆమె అంది. పిల్లలు సెటిల్ అయ్యాకనో, భర్త మరణం లేదా భర్త ‘ఇన్‌సెక్యూరిటీస్’ తగ్గాకనో లేదా కుటుంబం ‘జాలి తలిచి అనుమతి’ ఇస్తేనో లేదా కుటుంబంతో పోరాడో లేటు వయసులో స్త్రీలు పనికి మొగ్గు చూపుతున్నారు. ‘అమ్మ ఆసక్తులు అమ్మను పూర్తి చేసుకోనిద్దాం’ అని మనస్ఫూర్తిగా అనే కుటుంబాలు కూడా ఉన్నాయి. కాని ఈ కుటుంబ బంధం స్త్రీకు ఉన్నంతగా పురుషుడికి లేదు. పురుషుడు సర్వకాలాల్లో కుటుంబం అనుమతి చూడకుండా తాను చేయవలసింది చేయగలడు. స్త్రీలకు కూడా ఈ అవకాశం ఉండాలి అంటారు స్త్రీలు, ఆలోచనాపరులు.
‘ఏజ్ ఈజ్ నాట్ కేజ్’
52 ఏళ్ల లోదుస్తుల మోడల్ గీత.జె వార్తల్లో ఉన్నారు. అందుకు కారణం ఆమె ‘ఏజ్ ఈజ్ నాట్ కేజ్’ పేరుతో లోదుస్తుల తయారీ సంస్థలకు ఒక ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమం మొదలెట్టడమే. ఇప్పటికే ఆ పిటిషన్ మీద దాదాపు 7 వేల మంది సంతకాలు చేశారు. ఇంతకీ గీత ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆమె మోడల్ కాదలుచుకున్నారు. అది కూడా లోదుస్తులకు. కాని తయారీ సంస్థలు ఈ వయసులో మీరు కాలేరండీ అంటూ తిరస్కరించాయి. నిన్న మొన్నటి వరకూ ముంబైలో టీచర్‌గా పని చేసిన గీత ఏమంటున్నారో చూడండి.
అదే నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచింది
‘ప్రతి స్త్రీకి తన భవిష్యత్తు గురించి కలలు ఉంటాయి. కాని వాటిని నెరవేర్చుకోవడానికి సమయం ఉండదు కుటుంబం వల్ల. ఒక దశలో ఇప్పుడైనా మన కలల్ని నెరవేర్చుకుందాం కుటుంబం కోసం చేయాల్సింది చేశాం కదా అనిపిస్తుంది. నాకు మోడల్ కావాలని ఉండేది. వీలవలేదు. యాభై ఏళ్లు వచ్చాక ‘సీనియర్ మహిళల అందాల పోటీలో’ పాల్గొని రన్నర్ అప్‌గా నిలిచాను. అది నా కాన్ఫిడెన్స్‌ను పెంచింది. ఆ సమయంలోనే నేను లోదుస్తుల కొనుగోలుకు ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ సెర్చ్ చేశాను. నా వయసు వారి లోదుస్తులకు కూడా యంగ్ మోడల్సే ఉన్నారు. ఎందుకు నా వయసు వారి లోదుస్తులకు నా వయసు వారే మోడల్స్‌గా ఎందుకు ఉండకూడదు అనుకున్నాను.
ఈ వయసులో ఈ పని అవసరమా అన్నారు
అప్పుడే బ్రెజిల్‌కు చెందిన హెలెనా సేజల్ గురించి తెలుసుకున్నాను. ఆమె డెబ్బై ఏళ్ల వయసులో లోదుస్తుల మోడల్‌గా మారి గొప్ప స్ఫూర్తినింపారు. ఆ స్ఫూర్తితోనే నేను లోదుస్తుల మోడల్‌గా మారి ఫొటోషూట్ చేసుకున్నాను. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పోస్ట్ చేశాక నా కుటుంబం, స్నేహితులు, తెలియనివారు చాలామంది అప్రిసియేట్ చేశారు. ‘ఈ వయసులో ఈ పని అవసరమా’ అన్నవారు ఉన్నారు. స్త్రీలు ఏ వయసులో ఏం చేయాలో ఎందుకు చెప్తారు. అది పర్సనల్ చాయిస్. ఏ దుస్తులు ధరించాలో కూడా పర్సనల్ చాయిస్.
మా మీద లక్ష్మణరేఖ ఉంటుంది. అది దాటితే ఏదో ఒక లోపం, వంక, విమర్శ ఎదురవుతాయి. వయసు రావడం అనేది ఒక సహజ శారీరక ప్రక్రియ. మనం దానిని ఆపలేం. కాని ఆ వయసును మన కలలకు అడ్డంగా రానివ్వకుండా మనం చేసుకోగలం. నేను చెప్పాలనుకుంటున్నది అదే’ అంటారు గీత. ఆమె స్త్రీల వ్యక్తీకరణలు, ఆకాంక్షలు, కలలు, అభిలాషల పట్ల సగటు సమాజానికి ఉన్న పడికట్టు దృష్టిని మాత్రం చెదరగొడుతున్నారు.నీతూ సింగ్, గీత ఇద్దరూ కూడా స్త్రీలకు సంబంధించి ఏదో చెబుతున్నారు. మనం చేయవలసిందల్లా ఆ చెబుతున్నది సరిగ్గా విని అర్థం చేసుకుని అందుకు బాసటగా నిలవడమే.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment