
రితికాసింగ్‌కు ఓ అవకాశం వచ్చింది. ఇరుదుచుట్రు చిత్రంతో అనూహ్యంగా కోలీవుడ్‌లో హీరోయిన్ అవతారమెత్తిన రియల్ బాక్సింగ్ బ్యూటీ రితికాసింగ్. ఈ చిత్రం సక్సెస్‌తో కోలీవుడ్ దృష్టి ఈ అమ్మడిపై పడింది. అంతే వరుసగా అవకాశాలు చుట్టుముట్టాయి. అలా లారెన్స్‌తో శివలింగ చిత్రం చేసింది. అదీ ఓకే అనిపించుకుంది. ఆ తరువాత నటించిన ఆడవన్ కట్టలై చిత్రం హిట్ అయ్యింది. అంతే రితికాసింగ్‌కు అవకాశాలు ముఖం చాటేశాయి. మధ్యలో తెలుగులోకి గురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్రం ఇరుదుచుట్టుకు రీమేక్ అయిన ఆ చిత్రం హిట్ అయినా, అక్కడ మరో అవకాశం రాలేదు.
అలాంటిది కాస్త ఆలస్యంగా కోలీవుడ్‌లో మరో అవకాశాన్ని దక్కించుకుంది. నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తడం చిత్రాన్ని పూర్తి చేసిన అరుణ్ విజయ్ ప్రస్తుతం విజయ్‌ఆంటోనీతో కలిసి అగ్నిసిరగుగళ్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి చిత్రానికీ రెడీ అవుతున్నారు. దీనికి బాక్సర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు బాలా శిష్యుడు వివేక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాక్సర్ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం అరుణ్‌విజయ్ మలేషియా, వియత్నాం దేశాలలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారట. అంతేకాదు స్టంట్‌మాస్టర్ పీటర్ హెయిన్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారట. భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటి రితికాసింగ్ క్రీడా వార్తల విలేకరిగా నటించనుందని, చిత్ర షూటింగ్‌ను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దీనికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించనున్నారు.