ఆడకూతుళ్ల కోసం పోరాడేదెవరు?
‘‘ఢిల్లీలో ఓ ఆడకూతురిపై బస్‌లో చేసిన అఘాయిత్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎర్రకోట సాక్షిగా జరిగిన దుర్మార్గం అది. పైగా దేశరాజధాని. దాంతో మీడియా కూడా ఆ చర్యపై తీవ్రంగా స్పందించింది. జనాగ్రహ జ్వాలలతో పార్లమెంట్ అట్టుడికింది. కానీ... అలాంటి ఆఘాయిత్యాలే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా చోట్ల జరుగుతున్నాయి. గ్రామాల్లో, కుగ్రామాల్లో, తండాల్లో చివరకు నాగరిక పట్టణాలలో కూడా పసిపిల్లలని కూడా చూడకుండా కామాంధులు తెగబడుతున్నారు.
వారిని ప్రతిఘటించేదెవరు? ఆడకూతుళ్ల తరఫున నిలబడి పోరాడేదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘నిర్భయ భారతం’ ’’ అన్నారు నట దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘అమ్మ ఒక స్త్రీ. మనం నిత్యం కొలిచే ఆదిపరాశక్తి ఓ స్త్రీ. చివరకు ప్రకృతిని కూడా మనం స్త్రీతోనే పోలుస్తాం. అలాంటి స్త్రీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది.
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగిన రోజునే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అన్నాడు మహాత్ముడు. కానీ పట్టపగలే ఆడది తిరగలేని పరిస్థితి. మన పూజనీయ గ్రంథాలైన రామాయణ, మహాభారతాలు మనకు చెప్పింది ఒక్కటే. కామాంధులను తెగనరకమని. చర్యకు తక్షణమే ప్రతిచర్య కావాలని. సీతను రావణుడు ఎత్తికెళితే... రాముడు వేపచెట్టుకు మొక్కలేదు. వానరసేనను కూడగట్టి, జలధిని దాటి మరీ వెళ్లి రావణుడి పది తలలు నరికాడు.
నడి సభలో కౌరవులు ద్రౌపది వలువలూడదీస్తుంటే... పాండవులు భీష్ముణ్ణి ప్రాధేయపడలేదు. ఆ ఆఘయిత్యం చేసిన వాళ్లనే కాదు, చూసిన వాళ్లను కూడా మట్టిలో కలిపేశారు. మన గ్రంధాలు చెప్పిన నీతినే ఈ సినిమాలో చూపించాను. ప్రజాకవులు రాసిన పాటలు నా సినిమాకు కొండంత బలం. సెన్సార్ వారు కూడా సినిమాను అభినందించి రెండు కట్సే ఇచ్చారు. అతి త్వరలోనే పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాను’’అని చెప్పారు నారాయణమూర్తి.