గుర్రానికి ఎంత గ్రాసం మేపాం అన్నది కాదు.. రేసులో సినిమా గుర్రం ఎంత గ్రాసిందో చూడాలి. వంద కోట్ల షేర్ కొట్టాలంటే.. నలభై రూపాయల టికెట్లు రెండున్నర కోట్లు కొయ్యాలి. కోతలు కోస్తే సరిపోదు. కచ్చితంగా అన్ని టికెట్లు కొయ్యాలి. సినిమాకు ఎంత పెట్టాం అన్నది కాదు, టికెట్ తెగిందా లేదా అన్నది ముఖ్యం. మూడు పెద్ద సినిమాలు ఈ ఏడాది శతక్కొట్టాయి. ‘గీత గోవిందం’ వాటితో పోల్చి చూసుకుంటే చిన్న సినిమా. కాదు.. కాదు.. బుజ్జి సినిమా. కాదు.. కాదు.. బుల్లి సినిమా. అది కూడా చితక్కొట్టి, శతక్కొట్టింది.
‘సింహాసనం’ సినిమాను కోటి రూపాయల ఖర్చుతో తీస్తున్నారని తెలిసి ఇండస్ట్రీ నోరెళ్లబెట్టింది. ఆ రోజుల్లో కోటి రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. కోటి రూపాయలు వసూలు చేసిందని తెలిసినా చాలా పెద్ద మొత్తమే. తెలుగు సినిమా ఎదిగింది. బడ్జెట్‌ను పెంచుకుంది. ప్రేక్షకులను పెంచుకుంది. మార్కెట్‌ను పెంచుకుంది. అమలాపురంతో పాటు అట్లాంటాలో కూడా అదే రోజు అదే సమయానికి రిలీజయ్యే స్థాయికి చేరుకుంది. బాలీవుడ్‌లో వంద కోట్ల సినిమా క్లబ్ ఉందంటే గొప్పగా చూసే తెలుగు సినిమా ఇవాళ తాను కూడా దర్జాగా చాలా అలవోకగా వంద కోట్ల వసూళ్ల సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ కాలర్‌ను ఎగరేసేలా చేస్తోంది. భారీగా తీసిన సినిమాలనే కాదు మంచి కథతో తీసిన సినిమాలను కూడా వంద కోట్ల క్లబ్ వరకూ తీసుకెళతాం అని ప్రేక్షకులు చెప్పడం 2018 విశేషం. కాసులు కట్టగట్టి కనక మహాలక్ష్మి ఆనంద తాండవం చేసేలా చేసిన ఈ సంవత్సరం ‘100 కోట్ల క్లబ్’ సినిమాల రీవిజిట్.
‘రంగస్థలం’...
హిందీలో ‘బద్‌లాపూర్’ సినిమా వచ్చింది. అందులో హీరో తన చిన్నారి కొడుకు చావుకు కారణమైన వ్యక్తి జైలు శిక్ష ముగించుకుని వచ్చే వరకు వెయిట్ చేసి మరీ అతని మీద పగ తీర్చుకుంటాడు. సాధారణంగా జైలు శిక్ష పడితే సినిమా ముగుస్తుంది. కానీ జైలు శిక్ష అనుభవించినా సరే ఆ దుర్మార్గుణ్ణి క్షమించలేని హీరో అతని మీద పగ తీర్చుకుంటాడు. ‘రంగస్థలం’లో హీరో కూడా అంతే. దుర్మార్గంగా తన అన్నను చంపిన ప్రకాశ్‌రాజ్ కోమాలోకి వెళ్లినా రామ్‌చరణ్ క్షమించడు. అతడు స్పృహలోకి రావాలి. చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. అందుకే రెండేళ్లు సేవ చేసి మనిషిని చేసి అతను మెలకువగా, స్పృహలో ఉండగా తన చేతి కత్తితో కంఠం కత్తిరించి అతని మీద పగ తీర్చుకుంటాడు. మానవ స్వభావంలో పగ సహజాతమైనది. అందుకే ఆ లైన్ తెలుగువారికి బలంగా నచ్చింది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభను చాటారు. రామ్‌చరణ్ తండ్రిని తలపించి నేనూ చేయగలను అని నిరూపించాడు. సమంత, అనసూయ వంటి నటీమణులు బాగా నటించారు. చంద్రబోస్ రాసిన ‘ఎంత సక్కగున్నావే’, ‘రంగమ్మా మంగమ్మా’ పాటలు ఒక ఊపు ఊపాయి. 1985 కాలం నాటి తెలుగువారి జీవితం వెండితెర మీద ఆవిష్కృతం అయ్యింది. సినిమా పండింది. జనం జేబుల్లో నుంచి డబ్బు తీసి ధారాళంగా నిర్మాతకు ఇచ్చారు. సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయలు అయితే 190 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను సొంతం చేసుకుందని లెక్కలు చెబుతున్నాయి. ‘బాహుబలి’ కాకుండా ఆ ఫీట్‌ను సాధించిన మొదటి సినిమాగా నిలిచిపోయింది. సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ జోడీగా పనిచేసిన రామకృష్ణ, మోనికకు కూడా మంచి పేరు వచ్చింది. మైత్రీ మూవీస్ వారు ఘనంగా చెప్పుకోదగ్గ సినిమా ఇది.
భరత్ అనే నేను...
ఈ సినిమా కథ కత్తి మీద సాము. పొలిటికల్ కథలు ఏ కొన్నో తప్ప తెలుగువారికి నచ్చవు. ఈ సబ్జెక్ట్‌ను కోడి రామకృష్ణ తర్వాత అంత బాగా హ్యాండిల్ చేసే దర్శకులు తెలుగులో తక్కువగా వచ్చారు. హీరోను సీయం చేయడం అంటే అతని చేతులు కాళ్లు కట్టేయడమే. శంకర్ ‘ఒకే ఒక్కడు’లో ముఖ్యమంత్రి చేత ఎన్నో ఫీట్లు చేయించి హిట్ చేశాడు. కానీ తెలుగులో సి.ఎంను క్లాస్‌గా చూపించడం వల్ల శేఖర్ కమ్ముల ‘లీడర్’ ఒక వర్గానికే కనెక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో శివ కొరటాల పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో మహేశ్‌బాబును పెట్టి సినిమా తీస్తానంటే అందరూ టెన్షన్ పడ్డారు. కాని అటు క్లాస్‌ని ఇటు మాస్‌ని ఆకట్టుకునే విధంగా సినిమాను తీసి సక్సెస్ సాధించాడు శివ. ‘కింగ్ మేకర్’లు తెర వెనుక ఉండి పాలకులను ఎలా కీలుబొమ్మలుగా చేసి ఆడించడానికి చూస్తారో ఈ సినిమాలో డిస్కస్ చేయడం ఒక విషయం అయితే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉంటే పాలనా వ్యవస్థ సగం బాగుపడుతుందని చెప్పడం రెండో విశేషం. మేకింగ్ బాగుండటం, డైలాగులు ఆకట్టుకోవడం, పాటలు... ఇలా అన్నీ జనానికి నచ్చాయి. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమా మహేశ్‌బాబు కెరీర్‌లో ఇప్పటివరకు బెస్ట్ కలెక్షన్ సంపాదించిన చిత్రంగా ఉన్న ‘శ్రీమంతుడు’ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. సుమారు 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 168 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని సమాచారం. మహేశ్ చాలా హుందాగా చేతిలో బ్రీఫ్‌కేస్, టక్, నీట్ హెయిర్ కట్‌తో మేడమ్ స్పీకర్ అంటూ తను మాట్లాడిన భాష సినీ ప్రియులను అలరించింది. సినిమా చూస్తున్నంతసేపు నిజమైన శాసనసభ జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ ఏయస్. ప్రకాశ్ వేసిన అసెంబ్లీ సెట్ ఒక ప్లస్ పాయింట్. కియారా అద్వానీకి ఇది మొదటి సినిమా కావడం వల్ల తెర మీద తాజా భావన కలిగింది. దేవిశ్రీ ప్రసాద్ చేసిన ‘భరత్ అనే నేను...’,‘వచ్చాడయ్యోసామి..’, పాటలు సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యాయని మహేశ్ అన్నారు. శివ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు సింగిల్ కార్డ్ రైటర్‌గా పనిచేసిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.
‘అరవింద సమేత వీర రాఘవ’....
యుద్ధాన్ని మొదలెట్టడం సులువు కావచ్చు... కానీ యుద్ధాన్ని ముగించడమే చాలా కష్టం. యుద్ధం వద్దనుకోవడం అనే పాయింట్‌ను తీసుకుని తీసిన ‘క్షత్రియ పుత్రుడు’ ఫార్ములా ఈనాటికీ దక్షిణాదిన కాసులు మూటగట్టుకుంటూనే ఉంది. ఆ ఛాయలతో సినిమా తీసినా హిట్టే అయ్యింది. ‘అరవింద సమేత..’లో కూడా క్షత్రియ పుత్రుడు ఛాయలు ఉన్నా ఇది పూర్తిగా తెలుగువారి ఫ్యాక్షన్ ప్రాంతమైన రాయలసీమను కేంద్రంగా తీసుకుని తీయడంతో ఒరిజినాలిటీ సంతరించుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీయడానికి పేరుపడ్డ త్రివిక్రమ్ ఒక ఫ్యాక్షన్ కథను ఎలా తీసుంటాడో అన్న కుతూహలం, త్రివిక్రమ్–ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అన్న ఉత్సాహం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ తన పాత్రను గంభీరంగా, లోతుగా, ఒక చదువుకున్నవాడిలా పోషించి యూత్‌ను ఇన్‌స్పయిర్ చేశాడని చెప్పవచ్చు. సీమ యాసను అతను మెరిపించి మురిపించాడు. ‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు...వాడు గొప్పోడు’, ‘మాట్లాడితే వాళ్లే కాదు..శత్రువులు కూడా వింటారు’, ‘పాలిచ్చే తల్లులు సార్... పాలించలేరా?’ వంటి డైలాగులు సినిమాను నిలబెట్టాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించినా ఆమె నుంచి యూత్ ఏమి ఆశిస్తారో అది దర్శకుడు అందించకుండా పిసినారితనం పాటించాడనే చెప్పవచ్చు. తమన్ తన కెరీర్ బెస్ట్ మ్యూజిక్‌ను అందించాడు. మట్టివాసన ఉన్న రచయిత పెంచల దాస్ ఈ సినిమాతో విశేషమైన పేరు తెచ్చుకున్నాడు. కె.రాధాకృష్ణ (చినబాబు) దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం 158 కోట్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్‌కు కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది.
గీత గోవిందం...
‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’... అని హీరో విజయ్ దేవరకొండ అంటే ప్రేక్షకులు వంద కోట్లు మూటగట్టి ఇచ్చారు. ఆ సంబరంతో అతడు ‘చాల్లె ఇది చాల్లె’ అంటున్నా వినకుండా ఇంకొన్ని కోట్లు కూడా జేబులో వేశారు. చిన్న బడ్జెట్‌తో అనూహ్యమైన కలెక్షన్లు సాధించిన సినిమా ‘గీత గోవిందం’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తే పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అన్ని విధాలా టైమ్ బాగుందని చెప్పవచ్చు. ఎందుకంటే రిలీజుకు ముందే లీక్ అయినా జనం అదంతా పట్టించుకోలేదు. ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్‌ను లెక్క చేయని విజయ్ ఈ సినిమాలో హీరోయిన్ దగ్గర అణిగి మణిగి ఉండటం.. ఒక పక్కింటి కుర్రాడిలా కుటుంబాన్ని, తెలుగువిలువల్ని గౌరవించేలా కనిపించడం జనానికి తెగ నచ్చేసింది. ‘మేడమ్.. మేడమ్...’ అని అతడు పిలవడం ఒక సరదా. రాహుల్ రామకృష్ణ కామెడీ పండింది. అన్నింటి కంటే ముఖ్యం కథ వినే పాత్రధారిగా నిత్యా మీనన్‌ను దర్శకుడు ఎంచుకోవడంతో కథను సీరియస్‌గా వినాలనే భావన ప్రేక్షకులకు కూడా వచ్చింది. గోపి సుందర్ పాటలు దుమారం రేపాయనే చెప్పాలి. అందుకే సినిమాను 10 కోట్ల లోపే తీస్తే ఆ పెట్టుబడి మొదటి రోజే వచ్చింది. దాదాపు 115 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసిందంటే చిన్న విషయం కాదు. చిన్న సినిమా విజయం సాధిస్తేనే ప్రొడ్యూసర్‌కు నిజమైన ఆనందం ఉంటుంది. ఆ పరంగా ఈ ఏడాది బెస్ట్ కలెక్షన్లలో ‘గీత గోవిందం’ సినిమాకి ఫస్ట్‌ప్లేస్ ఇవ్వాల్సిందే.
ఇన్‌పుట్స్: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment