సూపర్ స్టార్ ఒక్కడే మిగిలాడు..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై 'కుమారీ 21ఎఫ్' సినిమాను తెరకెక్కించి సూపర్ కొట్టిన సుక్కు, ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అశోక్ ను హీరోగా.., హరిప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ తన అన్న కొడుకు కూడా కావటంతో సుకుమార్ సినిమా ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.
అందుకే తన సినిమాల్లో నటించిన స్టార్ హీరో హీరోయిన్లను దర్శకుడు ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సుక్కు, తరువాత రెండు పాటలను రకుల్, సమంతలతో లాంచ్ చేయించాడు. ఆడియోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేయించి సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు.
ఈ నెలాఖరున జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ హజరు కానున్నాడు. ఇలా సుకుమార్ తో కలిసి పని చేసిన హీరోలందరూ దర్శకుడు ప్రమోషన్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం మిస్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే సినిమా చేసిన మహేష్, ప్రస్తుతం స్పైడర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరి 'దర్శకుడు' మూవీ రిలీజ్ తరువాత జరగబోయే వేడుకల్లో సూపర్ స్టార్ కనిపిస్తాడేమో చూడాలి.