సాక్షి, సినిమా : యువ నటుడు శాంతను భాగ్యరాజ్ సైతం ఇద్దరమ్మాయిలతో సరసాలకు సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మంచి బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న హీరోలలో శాంతను భాగ్యరాజ్ ఒకరు. తన తండ్రి కే.భాగ్యరాజ్ సహా పలువురు దర్శకత్వంలో నటించినా ఆశించిన విజయాన్ని ఇప్పటి వరకూ అందుకోలేదు. అలాంటిదిప్పుడు దర్శకుడు మిష్కిన్‌ను నమ్ముకున్నారు. ఈ దర్శకుడి కథా చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయి. అదే సమయంలో కమర్షియల్ ఫార్ములాను మిస్ కావు. ఇటీవల మిష్కిన్ దర్శకత్వం వహించిన తుప్పరివాలన్, ఆయన నటించి, నిర్మించిన సవరకత్తి చిత్రాలు మంచి పేరును తెచ్చుకున్నాయి.
తాజాగా మిష్కిన్ శాంతను భాగ్యరాజ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. లిబ్రా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్న ఇందులో శాంతనుకు జంటగా నిత్యామీనన్, సాయిపల్లవిలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. వీరిలో నటి నిత్యామీనన్ శాంతనుకు జంటగా నటించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇక సాయిపల్లవితోనూ చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ అమ్మడిప్పుడు తమిళంతో పాటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటుడు శాంతను భాగ్యరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రం తన సినీ జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లిబ్రా ప్రొడక్షన్ సంస్థలో మిష్కిన్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇదో సూపర్ హీరో కథా చిత్రం అని జరుగుతున్న ప్రచారం గురించి ఆయన స్పందిస్తూ అది అసత్య ప్రచారం అని అన్నారు. ఈ చిత్రం కథ చాలా వ్యత్యాసంగా ఉంటుందని శాంతను భాగ్యరాజ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment