
టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ నటీనటులు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నారు. ఫిదా బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్న బ్యూటీ సాయి పల్లవి. తాజాగా నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఎంసీఏతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఈఏడాది శతమానం భవతి సినిమాతో మెదలు పెట్టి మహానుభావుడు వంటి హిట్లతో 2017ను యువ హీరో శర్వానంద్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పండుగ సీజన్‌లో పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి మంచి వసూల్లనే సాధించాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, సాయి పల్లవిలు క్రేజీ కాంబినేషన్‌లో కలిసి నటించనున్నారని సమాచారం. ప్రేమకధా చిత్రాలు తీయడంలో పేరుపొందిన హను రాగపూడి కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
‘మహానుభావుడు’ సినిమా తరువాత శర్వానంద్ నటించబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ వంటి ప్రేమకథా చిత్రాలతో అలరించిన రాగపూడి ఈ జోడితో రొమాంటిక్ సీన్స్ ని డైరెక్టర్ ఏ విధంగా చిత్రీకరిస్తాడో చూడాలి.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త సంవత్సరంలో మొదలుకానుంది.